తెలంగాణాలో రెడ్ జోన్లుగా 8 జిల్లాలు

గురువారం, 16 ఏప్రియల్ 2020 (09:32 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటికే కరోనా కేసులు ఎక్కువగా నమోదైన జిల్లాలను తెలంగాణ ప్రభుత్వం రెడ్ జోన్లుగా ప్రకటించింది. మొత్తం 8 జిల్లాల్లో ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. దీంతో ఈ ఎనిమిది జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు.
 
ఆ జిల్లాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, కరీంనగర్‌, నిర్మల్‌ జిల్లాలను హాట్‌స్పాట్‌ జిల్లాల(రెడ్‌ జోన్‌) జాబితాలో చేర్చారు. 
 
హైదరాబాద్‌(జీహెచ్‌ఎంసీ) పరిధిలో అత్యధికంగా 267 పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. నిజామాబాద్‌లో మొత్తం 36 కేసులుండగా, 15 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. వరంగల్‌ అర్బన్‌లో 21 పాజిటివ్‌ కేసులున్నాయి. 
 
రంగారెడ్డిలో 16, జోగులాంబ గద్వాలలో 18, మేడ్చల్‌-మల్కాజ్‌గిరిలో 22 కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాల్లో కేసుల సంఖ్య మరింత పెరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. 
 
అదేవిధంగా 19 జిల్లాలను నాన్‌-హాట్‌స్పాట్‌లో చేరింది. ఇందులో సూర్యాపేట, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, కామారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్‌, ములుగు, పెద్దపల్లి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్‌, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. ఇందులో సిద్దిపేట, సిరిసిల్ల, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసే నమోదైంది. నాగర్‌కర్నూలు, జగిత్యాల, ములుగు జిల్లాల్లో రెండేసి కేసులు నమోదయ్యాయి.
 
ఇకపోతే, గ్రీన్ జోన్లుగా ఆరు జిల్లాలను గుర్తించింది. నారాయణ్‌ఖేడ్‌, వనపర్తి, వరంగల్‌ రూరల్‌, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కేంద్రం నిర్దేశం ప్రకారం ఇవి గ్రీన్‌ జోన్‌ జిల్లాల కిందే లెక్క. అదే సమయంలో జనగామ జిల్లాలో రెండు కేసులు నమోదైనా ఇద్దరూ డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో జనగామ కూడా గ్రీన్‌ జోన్‌లో చేరినట్లే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు