భారత్‌లో కరోనా వైరస్ ఉత్పాతం తప్పదా?

బుధవారం, 3 జూన్ 2020 (13:34 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా, ఐదు రాష్ట్రాల్లో ఈ వైరస్ జెట్ స్పీడ్ వేగంతో వ్యాపిస్తోంది. దీంతో కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం రెండు లక్షలు దాటిపోయాయి. మంగళవారం రాత్రితో ఈ కేసు సంఖ్య 2 లక్షలు దాటిపోయింది. ముఖ్యంగా తొలి లక్ష కేసులు నమోదయ్యేందుకు నెలన్నర రోజులు పడితే.. మిగిలిన లక్ష కేసులు నమోదయ్యేందుకు కేవలం 15 రోజుల సమయం మాత్రమే పట్టింది. 
 
ఇది పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే తెలుపుతోంది. ఇదే వేగంతో కేసులు విస్తరిస్తే, మరో 30 రోజుల్లో ఎనిమిది లక్షలు, ఆపై మరో నెల రోజుల వ్యవధిలో 32 లక్షల కేసులు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇక మంగళవారం ఒక్కరోజులో 200 మందికి పైగా మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 5,600కు చేరువైంది. ప్రస్తుతం మొత్తం కేసుల పరంగా ఇండియా ఏడో స్థానంలో ఉంది. భారత్ కంటే ముందు స్థానంలో ఇటలీ 2.33 లక్షల కేసులతో ఉండగా, మూడు నుంచి నాలుగు రోజుల్లోనే భారత్ ఆరో స్థానానికి చేరి, ఇటలీని కిందకు పంపడం ఖాయంగా కనిపిస్తోంది.
 
మరోవైపు, గత 24 గంటల్లో మరో 8,909 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 217 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 207,615 కి చేరగా, మృతుల సంఖ్య 5,815 కి చేరుకుంది. 1,01,497 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 100,303 మంది కోలుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు