తెలంగాణాలో జోరు తగ్గిన కరోనా వైరస్ - కేరళలో పాజిటివ్ కేసులు నిల్

సోమవారం, 4 మే 2020 (21:38 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ వ్యాప్తికి బ్రేక్ వేసిందని చెప్పొచ్చు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ప్రత్యేక చర్యలు, సమీక్షల పుణ్యమాని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరుగులు పెట్టారు. ఫలితంగా కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకోగలిగారు. ఈ కారణంగానే సోమవారం కేవలం మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. 
 
అవి కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1085కి పెరిగింది. అలాగే, సోమవారం 40 మంది డిశ్చార్జి కాగా, తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 29 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 471 మంది చికిత్స పొందుతుండగా, 585 మంది కోలుకున్నారు.
 
మరోవైపు, దేశంలో తొలి కరోనా కేసు కేరళలోనే నమోదైంది. ఆ తర్వాత ఆ రాష్ట్రంలో కేసులు పెరిగిన తీరు దేశాన్ని బెంబేలెత్తించింది. అయితే, అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అధికారుల కృషి, ప్రజల భాగస్వామ్యం ఆ రాష్ట్రాన్ని కరోనా రక్కసి నుంచి బయటపడేలా చేశాయి.
 
గత రెండు రోజుల నుంచి కేరళలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు, ఈరోజు 61 మంది పేషెంట్లు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 34 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 499 పాజిటివ్ కేసులు నమోదు కాగా నలుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
 
మరోవైపు ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారావీలో కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఆ ప్రాంతంలో కొత్తగా 42 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ప్రాంతంలోని కేసుల సంఖ్య 632కి చేరుకోగా... 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు