తెలంగాణాకు పాకిన కరోనా... ఢిల్లీలో మరో కేసు... ప్రకటించిన కేంద్రం

సోమవారం, 2 మార్చి 2020 (15:21 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణా రాష్ట్రంలోకి ప్రవేశించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. అలాగే, ఢిల్లీలో కూడా మరో కరోనా కేసు నమోదైంది. ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యక్తిలో ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్టు తెలిపింది. మొత్తంగా దేశంలో ఇప్పటివరకు రెండు కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు కేంద్రం ప్రకటించింది. 
 
ఇటీవల దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విమానంలోని ప్రయాణికులకు కరోనా వైరస్ పరీక్షలు చేయగా, అందులో ఇద్దరికీ ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వీరిద్దరినీ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వార్డులో ఉంచారు. ఆ తర్వాత వీరి రక్తనమూనాలను తీసి పూణెకు పంపించారు. అక్కడ జరిపిన పరీక్షల్లో ఒకరికి వైరస్ సోకినట్టు తేలింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో నమోదైన తొలి కేసు కావడం గమనార్హం. 
 
అలాగే, ఢిల్లీలో కూడా మరో కరోనా వైరస్ కేసు నమోదైంది. ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు కేంద్రం తెలిపింది. కాగా, స్వైన్ ఫ్లూ, కరోనా వైరస్ లక్షణాలు ఒకేలా ఉన్నప్పటికీ... ఎవరికైనా జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉన్నా.. గొంతు నొప్పిలాంటి ఇబ్బందులున్నా.. తప్పనిసరిగా డాక్టర్లను సంప్రదించాలని కోరారు.
 
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు అనుమానిత కేసులు నమోదు కాలేదు. అయితే తిరుపతిలోని ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో కరోనా వైరస్ లక్షణాలతో ఓ వ్యక్తి చికిత్స చేయించుకునేందుకు చేరడం కలకలం సృష్టించింది. చైనాకు చెందిన ఒక టెక్నీషియన్ ప్రైవేటు ఫ్యాక్టరీలో మరమ్మత్తులు చేసేందుకు భారత్‌కు రాగా, ఆ వ్యక్తికి రెండు రోజులుగా తీవ్ర జలుబు, దగ్గు ఉంది. అతను రుయా ఆసుపత్రిలో చేరగా.. యువకుడి రక్తనమూనాలను సేకరించి పూణె పరిశోధనాశాలకు పంపించారు. ఈ పరీక్షల ఫలితాలు మరో రెండురోజుల్లో వెల్లడికానున్నాయి.

 

Update on #COVID19:

Two positive cases of #nCoV19 detected. More details in the Press Release.#coronoavirusoutbreak #CoronaVirusUpdate pic.twitter.com/kf83odGo8f

— Ministry of Health (@MoHFW_INDIA) March 2, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు