భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ రెండో డోసు శనివారం ప్రారంభమైంది. జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఆ రోజున తొలి డోసు తీసుకున్న లబ్ధిదారులకు శనివారం నుంచి రెండో డోసు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటి వరకూ దేశంలో 77లక్షల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ యోధులు తొలి దశలో వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 97 శాతం మంది టీకా పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
దేశంలో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి అత్యధికంగా 8 లక్షల మందికిపైగా టీకా తీసుకోగా తర్వాత మధ్యప్రదేశ్, గుజరాత్‌లో ఆరేసి లక్షల మందికి పైగా టీకా తీసుకున్నారు. ఇప్పటి వరకూ సీరమ్ తయారీ కొవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వేస్తుండగా ఏప్రిల్‌లో రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.