హైదరాబాద్ శంషాబాద్ చేరుకున్న స్పుత్నిక్-వి వ్యాక్సిన్లు
ఆదివారం, 16 మే 2021 (11:21 IST)
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్లు చేరుకున్నాయి. రెండో విడుతలో 1.50లక్షల డోసులు ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. అక్కడికి నుంచి వాటిని నేరుగా రెడ్డీస్ ల్యాబ్‌కు తరలించారు.
మొత్తం 67 లక్షల డోసులు కావాలని కంపెనీ ఆర్‌డీఐఎఫ్‌ను కోరగా.. రష్యా వాటిని విడుదల వారీగా పంపిస్తోంది. సోమవారం నుంచి దేశంలో టీకా పంపిణీ ప్రారంభం కానుంది. జూన్ నుంచి దేశంలోనే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నట్లు రెడ్డీస్ ల్యాబ్ ఇప్పటికే ప్రకటించింది.
టీకాను రష్యాకు చెందిన గమలేయ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసింది. రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ఎగుమతి చేస్తుండగా.. డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు దేశంలో అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం విధితమే. ప్రస్తుతం కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల పంపిణీ జరుగుతోంది. వ్యాక్సిన్ సైతం అందుబాటులోకి రావడంతో దేశంలో రెండో దశలో కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
ఇటీవల వ్యాక్సిన్‌కు సంబంధించిన ధరను సైతం డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. ఒక్కో డోస్ ధర రూ.995గా నిర్ణయించింది. టీకా వాస్తవ ధర రూ.948 కాగా.. దీనికి జీఎస్టీ అదనమని తెలిపింది. టీకా 91.6 శాతం ప్రభావంతం పని చేస్తుందని ఆర్‌డీఐఎఫ్ తెలిపింది. దీన్ని రెండు నుంచి ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య నిల్వ చేసే అవకాశం ఉంది.
రెండు డోసుల వ్యాక్సిన్ కాగా, మొదటి డోసు ఇచ్చిన 21వ రోజున రెండో డోసు ఇవ్వనుండగా.. 28 నుంచి 42 రోజుల మధ్యలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుందని ఆర్‌డీఐఎఫ్ పేర్కొంది.
మరోవైపు, రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ కొవిడ్ వ్యాక్సిన్‌కు వినియోగానికి వెనిజులా ఆమోదం తెలిపినట్లు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) శనివారం తెలిపింది. ధర మోతాదాకు పది డాలర్ల కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది.
ఇప్పటికే వెనిజులా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను వినియోగిస్తుందని, సింగిల్ డోస్ వ్యాక్సిన్ సైతం టీకాలు వేగవంతం చేయడంలో సహాయపడుతుందని ఆర్‌డీఐఎఫ్ అధిపతి కిరిల్ డిమిత్రివ్ పేర్కొన్నారు.