కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకుంటే ఫలితం ఎలా వుంటుందో తెలుసా?

బుధవారం, 12 మే 2021 (13:37 IST)
న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ డోసు ఒక్కటి తీసుకుంటే.. కరోనా బాధితులను 80 శాతం వరకు మరణం నుంచి కాపాడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఈ మేరకు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్(పీహెచ్ఈ) తెలిపింది. ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్న తర్వాత 80 శాతం వరకు, రెండో డోసు వేసుకున్న తర్వాత 97 శాతం వరకు మరణం నుంచి కాపాడుతుందని వెల్లడించింది.
 
వాస్తవిక పరిస్థితులను బట్టి ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మరణాలను తగ్గిస్తుందని పీహెచ్ఈ పేర్కొంది. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు 28 రోజుల్లో కరోనాతో చనిపోయినవారి డేటాను పరిశీలించగా.. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వేసుకున్నవారు ప్రాణాలు నిలుపుకున్నారని తెలిపింది.
 
వ్యాక్సిన్ వేసుకోని వారికంటే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్నవారు 55 శాతం మంది, ఫైజర్ డోసు వేసుకున్నవారు 44 శాతం మంది మరణం నుంచి తప్పించుకుంటున్నారని వెల్లడించింది. కరోనా బాధితులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక డోసు వేసుకోవడం ద్వారా 80 శాతం మరణం నుంచి రక్షణ పొందుతున్నారని పీహెచ్ఈ తన అధ్యయనంలో వెల్లడించింది.
 
ఇక ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ కరోనా వచ్చే రెండు వారాల ముందు వేసుకున్నా.. మరణం నుంచి 69 శాతం రక్షణ కల్పిస్తుందని పేర్కొంది. ఈ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుంటే 97 శాతం రక్షణ కల్పిస్తుందని పీహెచ్ఈ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు