కరోనాతో ఆటలు కాదు.. ఓసారి గెలిచి మరోసారి ఓడిన యువ డాక్టర్!

ఆదివారం, 8 నవంబరు 2020 (16:21 IST)
కరోనా వైరస్ సోకిన రోజులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, అజాగ్రత్తగా వ్యవహరించినా పైలోకాలకు వెళ్లక తప్పదు. ఈ మాటలు ఎవరో చెప్పలేదు. సాక్షాత్ ఓ యువ వైద్యుడి విషయంలో అనుభవపూర్వకంగా నిరూపితమైంది. కరోనా వైరస్ బారినపడిన ఆ వైద్యుడు... తొలుత విజయం సాధించాడు. ఆ తర్వాత మళ్లీ ఈ వైరస్ బారినపడి మృత్యువొడిలోకి చేరుకున్నాడు. ఈ విషాదకర ఘటన కడప జిల్లా బద్వేల్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చింది. బద్వేల్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చిన్నపిల్లల వైద్యుడుగా నందకుమార్ పని చేస్తున్నారు. ఈయన కరోనాతో కన్నుమూయడం తీవ్ర విషాదం నింపింది. నందకుమార్ వయసు 28 సంవత్సరాలు. ఆయన మూడు నెలల కిందట కరోనా బారినపడి కోలుకున్నారు. ఆపై తన విధులకు హాజరవుతున్నారు. 
 
అయితే, ఇటీవలే మళ్లీ కరోనా సోకింది. రెండు వారాల కిందట జ్వరం రావడంతో కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని వెల్లడైంది. దాంతో ఇంటివద్దే చికిత్స పొందారు. తగ్గకపోవడంతో కడప రిమ్స్ కు వెళ్లారు. 
 
అక్కడ్నించి తిరుపతి స్విమ్స్‌కు, ఆపై చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. ఈ క్రమంలో డాక్టర్ నందకుమార్ ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పనిచేసిన ఆసుపత్రిలో సిబ్బంది, బంధుమిత్రులు తీవ్రవిచారానికి లోనయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు