దేశంలో కరోనా కేసులు 80 లక్షలు దాటేశాయి. సగం మందికి అనధికారికంగా వచ్చిపోయిందని కొందరంటున్నారు. ఏది ఏమైనా డిసెంబర్ నాటికి కరోనా తగ్గుముఖం పడుతుందని సర్కారీ గణాంకాలు చెబుతున్నాయి. మరణాల రేటు కూడా తగ్గుతోంది. అయినా ప్రజల నిర్లక్ష్యం కారణంగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 30 వరకు నిబంధనలున్నా జనం సామాన్యజీవనానికి వచ్చేస్తున్నారు. ఉద్యోగాలు, ఉపాధి ఇతర అవసరాల కోసం పరిమితులు దాటిపోతున్నారు.
ఈ నేపథ్యంలో చలికాలం వచ్చేసింది. వైరస్, బ్యాక్టీరియాలు పంజా విసరడానికి.. ఇది ఎంతో అనుకూలమైన కాలం. ఈ ఏడాది కరోనాతో పాటు మరెన్నో సీజనల్ రోగాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏటా ఈ సమయంలో డెంగీ, మలేరియా, స్వైన్ ఫ్లూ తదితరల సీజనల్ వ్యాధులు విపరీతంగా అటాక్ చేస్తాయి. గతంతో పోలీస్తే ఈసారి సీజనల్ వ్యాధులు కాస్త తక్కువగానే నమోదవుతున్నా.. ఈ సమయంలో కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు.
ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తుంది.. అలా అని కరోనా పీడ విరగడైందనే భ్రమ మాత్రం వద్దంటున్నారు డాక్టర్లు. ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాల్లో సెకండ్ వేవ్ వణికిస్తోంది. కేరళలో తగ్గిన కరోనా కేసులు.. ఓనం పండుగ తర్వాత పెరిగిపోయాయి. అందుకే మొదటి సారి వైరస్ నియంత్రణ కోసం తీసుకున్న జాగ్రత్తలు.. ఇపుడు కచ్చితంగా కొనసాగించాలంటున్నారు వైద్యులు.