అదేసమయంలో యూరప్ వంటి దేశాల్లో కరోనా మహమ్మారి తిరగబెడుతోందని, నెమ్మదించినట్టే నెమ్మదించి మళ్లీ విరుచుకుపడుతోందని, భారత్‌లో రాబోయేది చలికాలం కావడంతో భారత్‌లో ఈ వైరస్ తీవ్రమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమన్నారు.
అందువల్ల ఈ అంశంపై విస్తృతస్థాయిలో పరిశోధనలు చేస్తున్నట్టు పాల్ వెల్లడించారు. ప్రస్తుతం భారత్ మెరుగైన స్థితిలోనే ఉందని, అయితే అనేక అవరోధాలను అధిగమించాల్సి ఉందన్నారు. కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తే భద్రపరిచేందుకు కావాల్సినన్ని కోల్డ్ స్టోరేజిలు ఉన్నాయని వెల్లడించారు.
ఇదిలావుంటే, కరోనా గురించి పరిశోధకులు చేస్తోన్న అధ్యయనంలో భాగంగా అనేక కొత్త విషయాలు తెలుస్తున్నాయి. శరీరంలోకి కరోనా ప్రవేశిస్తే అనేక శరీర భాగాలు పాడయ్యే అవకాశం ఉంటుందని పరిశోధకులు ఇప్పటికే గుర్తించారు.
ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, క్లోమం, కాలేయంపై కరోనా ప్రభావం చూపుతుందని ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. యువతలోనూ ఈ అవయవాలు పాడయ్యే అవకాశం ఉంది.
తాజాగా యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనంలో మరో కొత్త విషయం తెలిసింది. చెవులు కూడా వైరస్ ప్రభావానికి గురవుతాయని, దీంతో పాక్షికంగా లేక పూర్తిగా వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు. అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఈ వివరాలను బీఎంజే కేస్ రిపోర్ట్ జర్నల్‌లో ప్రచురించారు.