తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ బయటపడింది. దుబాయ్ వెళ్లి వచ్చిన టెక్కీకి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పైగా, స్థానికుల్లో భయాందోళనలు కూడా ఎక్కువయ్యాయి. దీంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ రంగంలోకి దిగారు. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇందుకోసం ఓ యాక్షన్ ప్లాన్‌ను ఖరారు చేశారు. ఈ క్రమంలో మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌పై మంత్రివర్గ ఉపసంఘం సమగ్రంగా చర్చించిందని చెప్పారు. కరోనా విషయంలో వదంతులను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
'కరోనా విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని ముందు జాగ్రత్తలు, శుభ్రత పాటిస్తే సరిపోతుంది. కరోనా వైరస్ నివారణ చర్యలపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే చోటే కరోనా వైరస్ జీవించే అవకాశం ఉంది. మన దగ్గర ఉష్ణోగ్రతలు ఎక్కువ కనుక వైరస్ వ్యాపించే అవకాశం తక్కువగా ఉంటుంది. మిలిటరీ, చెస్ట్, ఫీవర్, వికారాబాద్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని' వివరించారు.
అంతేకాకుండా 'బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. ముందు జాగ్రత్తలపై హోర్డింగ్‌లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తాం. కరోనా హెల్ప్‌లైన్ నెంబర్ 104 ఏర్పాటు చేశాం. కరోనా వైరస్ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. మాస్కులు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. కొంతకాలం షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని కోరుతున్నా. సన్నిహితులు, బంధువులు కలిసినా నమస్కారం చేయండి. ఇతర దేశాల్లో అవలంభిస్తున్న జాగ్రత్త చర్యలు అధ్యయనం చేస్తున్నామని' మంత్రి ఈటల వెల్లడించారు.