హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. కరోనా సోకిందని ఆస్పత్రికి వెళ్తే.. ఆస్పత్రి యాజమాన్యాలు కరోనా సాకుతో వ్యాపారం చేసుకుంటున్నాయి. కరోనా లేకపోయినా ఓ న్యాయవాదిని కరోనాకు చికిత్స అందించే వార్డులో ఉంచి, నాలుగు రోజుల పాటు చికిత్స చేసి రూ.3 లక్షల బిల్లు వేసింది ఓ హైదరాబాదు ఆస్పత్రి. ఈ ఘటనపై ఆ న్యాయవాది పోలీసులను ఆశ్రయించాడు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని విజయనగర్‌కాలనీకి చెందిన శ్రీధర్‌సింగ్ అనే న్యాయవాదికి జూలై 28న స్వల్పంగా జ్వరం, తలనొప్పి వచ్చాయి. దీంతో ఆయన సోమాజీగూడలోని డెక్కన్ ఆస్పత్రికి వెళ్లారు. కరోనాగా అనుమానించిన వైద్యులు ఆయనకు ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించారు. ఆ సమయంలో ఆయన ఆధార్‌కార్డు తీసుకున్నారు.
కానీ, నమూనా పంపేటప్పుడు.. ఆయన ఫోన్ నంబరు ఇవ్వకుండా, తమ ఉద్యోగి ఫోన్ నంబరు పెట్టారు. శ్రీధర్‌ను కరోనా వార్డులో ఉంచారు. పరీక్ష ఫలితం నెగెటివ్‌గా వచ్చినా.. ఆ విషయాన్ని శ్రీధర్‌కు చెప్పకుండా కరోనా చికిత్స చేశారు. తన పరీక్ష ఫలితంపై శ్రీధర్ ఆస్పత్రి నిర్వాహకులను గట్టిగా నిలదీయగా రిపోర్టును అందజేశారు.