దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఏడు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో గత 24 గంటల్లో 7,584 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు 7,240 కేసులు నమోదయ్యాయి. అలాగే, 24 మంది చనిపోగా, మరో 3,791 మంది కోలుకున్నారు.
తాజాగా నమోదైన కేసులతో కలుపుకుంటే ఇపుడు దేశంలో 36,267 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,32,05,106కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 4,26,44,092 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 5,24,747కు చేరింది.
ప్రస్తుతం దేశంలోని రాష్ట్రాల్లో అత్యధిక పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే 8813 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత కేరళలో 2193, ఢిల్లీలో 622, కర్నాటకలో 471, హర్యానాలో 348 చొప్పున పాజిటివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు కూడా పెరుగుతున్న విషయం తెల్సిందే.