మహారాష్ట్ర.. లాక్డౌన్ కోరుకోవట్లేదు.. కానీ పరిష్కారమేంటి..? సీఎం ఉద్ధవ్ ఠాక్రే

శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (22:14 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 29 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3.8 లక్షలు దాటింది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 47,827 కరోనా కేసులు, 202 మరణాలు నమోదయ్యాయి. 
 
దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,04,076కు, మరణాల సంఖ్య 55,100కు చేరింది. అలాగే ముంబైలో శుక్రవారం రికార్డు స్థాయిలో 8,832 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం సంఖ్య 4,32,192కు పెరిగింది.
 
ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్‌ విధించడాన్ని తోసిపుచ్చలేమని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్న వేళ శుక్రవారం రాత్రి ఆయన ఈ ప్రకటన చేశారు. త్వరలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించనున్నట్టు తెలిపారు. కొవిడ్‌ గొలుసును ఛేదించడంపై పరిష్కారాల కోసం అన్వేషిస్తున్నట్టు చెప్పారు.
 
తానూ లాక్‌డౌన్‌ కోరుకోవడంలేదని, కానీ పరిష్కారమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 65 లక్షల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామన్నారు. నిన్న ఒక్కరోజే 3 లక్షల మందికి టీకా వేసినట్టు తెలిపారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత కూడా మాస్క్‌ ధరించకపోవడంతో కొందరు ఈ వైరస్‌ బారిన పడుతున్నారన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు