తల్లి మృతి.. పక్కనే పసి ప్రాణం.. ఆకలితో చంటిబిడ్డ అల్లాడిపోతున్నా..?

సోమవారం, 3 మే 2021 (18:13 IST)
కరోనాతో జనాలు ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా బారిన పడకుండా వుండేందుకు ఇంటికే పరిమితం అవుతున్నారు. అయితే కొందరు కరోనా భయంతో సాటి మనిషి ఎన్ని బాధలు పడుతున్నా పట్టించుకోవట్లేదు. తాజాగా కరోనా భయంతో కళ్లముందు ఆకలితో చంటిబిడ్డ అల్లాడిపోతున్నా.. గుక్క పట్టి గుండెలవిసేలా ఏడుస్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. 
 
దీంతో తల్లి చనిపోయిందని కూడా తెలియని 18 నెలల పసిబిడ్డ అమ్మ మృతదేహం పక్కనే ఆకలితో గుక్కపట్టి ఏడుస్తున్నా ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో ఆ పసిబిడ్డ రెండు రోజులుగా ఆకలితో అలమటించిపోయి ఏడ్చే ఓపిక కూడా లేక దీన స్థితిలో పడి ఉన్న అత్యంత అమానవీయమైన ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ తన 18 నెలల బిడ్డతో కలిసి పుణెలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడి శనివారం (మే 1,2021)న చనిపోయింది. ఆమె కరోనాతో అయి ఉండవచ్చనే భయంతో ఇరుగుపొరుగు వారు ఎవరూ ఆమె దగ్గరికి కూడా రాలేదు. 
 
కనీసం పసిబిడ్డను కూడా పట్టించుకోలేదు. దీంతో.. రెండు రోజుల పాటు ఆమె శవం ఇంట్లోనే ఉంది. ఆలనాపాలనా చూసేవాళ్లు లేక ఆ పసిబిడ్డ తల్లి మృతదేహం పక్కనే ఆకలితో ఏడుస్తూ ఉండిపోయాడు. కానీ.. చిన్నారి బాధను చూడలేక ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు పసిబిడ్డను అక్కున చేర్చుకుని పాలు తాగించి ఆకలి తీర్చారు.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారించగా.. మృతురాలి భర్త పని మీద ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాడని, అతడి రాక కోసం ఎదరుచూస్తున్నామని ఓ పోలీసులు అధికారి తెలిపారు. చనిపోయిన మహిళ కోవిడ్‌తో మరణించిందా లేదా మరేదైనా కారణాలతో చనిపోయిందనే విషయం తెలియాల్సి ఉందని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు