కరోనా విజృంభణ : పార్కులు మూసివేత - దేశంలో 107 కేసులు

ఆదివారం, 15 మార్చి 2020 (14:39 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో హైదరాబాద్ నగరంతో పాటు నగర శివారు ప్రాంతాల్లోని పార్కులను మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు హెచ్‌ఎండీఏ ప్రకటన చేసింది. ఈ నెల 21వ తేదీన వరకు హైదరాబాద్‌లోని లుంబినీపార్క్‌, ఎన్టీఆర్‌ గార్డెన్‌, మెమోరియల్‌, సంజీవయ్య పార్క్‌లను బంద్‌ చేస్తున్నట్లు తెలిపింది. 
 
జలగం వెంగళరావు పార్కు, పబ్లిక్ గార్డెన్, జల విహార్‌, నెహ్రూ జూపార్క్‌, ఇందిరా పార్క్‌ వంటి అన్ని మున్సిపాలిటీల్లోని పార్కులను మూసివేస్తున్నట్లు పేర్కొంది. అలాగే ప్రజలు అధికంగా పర్యటించే పలు ప్రాంతాలను మూసేస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలోని సభలు, సమావేశాలకు అనుమతులు రద్దు చేశారు. 
 
అందరిపై నిఘా... 
మరోవైపు, కరోనాతో హైదరాబాద్‌లో మృతి చెందిన 76 ఏళ్ల బెంగళూరు వ్యక్తి మహమ్మద్ సిద్దిఖీ హుసేనీ అంత్యక్రియలు పాల్గొన్న అందరిపైనా అధికారులు నిఘా పెట్టారు. ముఖ్యంగా తాళికోటలోని ఆయన బంధువుల ఇళ్లపై నిఘా పెంచారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న 67 మందికి చికిత్స అందిస్తున్నారు. మరో నలుగురిని మాత్రం ఐసోలేషన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. 
 
బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని శనివారం సందర్శించిన కలెక్టర్ వారికి అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు. కరోనా అనగానే భయపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. అయితే, అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే కాల్‌సెంటర్లు, హెల్ప్‌లైన్ల సాయం తీసుకోవాలని సూచించారు.
 
వైరస్ సోకిన వారితో సన్నిహితంగా ఉండడం వల్ల మాత్రమే అది వ్యాపిస్తుందన్నారు. విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. దేశంలో కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన తొలి వ్యక్తిగా సిద్దిఖీ రికార్డులకెక్కారు. హైదరాబాద్‌లో మృతి చెందిన ఆయన అంత్యక్రియులు కర్ణాటకలోని కలబుర్గిలో జరిగాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు