తెలంగాణ రాష్ట్రాన్ని గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ కేసులతో పాటు మరణాలు కూడా హడలెత్తిస్తున్నాయి. వాస్తవానికి గత వారం రోజుల క్రితం వరకు ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్నట్టు కనిపించింది. కానీ, గత ఐదారు రోజులుగా ప్రతి రోజూ కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అలాగే, మరణాలు కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి.
జూన్ ఒకటో తేదీ అయిన సోమవారం కూడా కొత్తగా 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో కలిపి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,792కి చేరింది. కరోనా వల్ల సోమవారం ఆరుగురు మృతి చెందారు. దీంతో కరోనా మరణాలు 88కి చేరాయి. కరోనా కారణంగా ఆదివారం కూడా ఐదుగురు చనిపోయారు. అయితే మరణాల సంఖ్య కలవరపెడుతోంది.
ఎప్పట్లాగే అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 79 మందికి కరోనా సోకింది. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా గ్రేటర్‌లో ఎక్కువగా ఉన్నాయి. రంగారెడ్డిలో 3, మేడ్చల్‌లో 3, మెదక్, నల్గొండ, సంగారెడ్డిలో రెండేసి కేసులు నమోదయ్యాయి. మహబూబాబాద్‌లో, పెద్దపల్లిలో, జనగాంలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
కాగా, ఇప్పటివరకు 1,491 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,213 యాక్టివ్ కేసులున్నాయి. లాక్‌డౌన్ సడలించడంతో కేసుల సంఖ్య పెరుగుతున్నాయనే అభిప్రాయాలు వస్తున్నాయి. గత నెలలతో పోల్చితే మే నెల ప్రారంభం నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి.
మే 31న అత్యధికంగా 199 కేసులు నమోదయ్యాయి. జూన్, జులై నెలల్లో కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అటు వైద్య వర్గాలతో పాటు.. ఇటు తెలంగాణ వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.