తెలంగాణాలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా వైరస్!

మంగళవారం, 9 మార్చి 2021 (08:57 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గత జనవరి నెలతో పోల్చుకుంటే ఫిబ్రవరి నెలలో ఈ కేసులు అధికమవయ్యాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీనికి పాఠశాలలు, కాలేజీలు తెరవడం కూడా ఓ కారణంగా ఉంది. ముఖ్యంగా, ప్రైవేటు సంస్థల్లో తెలియకుండానే ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకుతోంది. 
 
రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతోంది. కేసుల సంఖ్యకు, క్షేత్రస్థాయి పరిస్థితికి పొంతన ఉండడం లేదు. పొరుగు రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతుండడం రాష్ట్రంలోనూ ప్రభావం చూపుతోంది. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో కేసులు రెట్టింపు అయ్యాయి. మార్చిలో ఇంకా పెరుగుతున్నాయి. జనవరిలో కేవలం 4,079 కేసులు నమోదైతే.. ఫిబ్రవరిలో 8,029 వచ్చాయి. 
 
కొద్ది రోజులుగా కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతోందని క్షేత్రస్థాయిలో టెస్టులు చేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్లు చెబుతున్నారు. ఫిబ్రవరి చివరి నుంచి క్రమంగా సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని, కొన్నిచోట్ల వంద శాంపిల్స్‌లో ఒకటి, రెండు వస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 15 వస్తున్నాయని చెబుతున్నారు. కేసులు పెరుగుతున్న విషయాన్ని వైద్య శాఖ కూడా అంతర్గతంగా అంగీకరిస్తోంది. 
 
రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లోనే కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్‌లో జిల్లాలో ఇటీవల ఒకరి అంత్యక్రియల్లో పాల్గొన్న 33 మందికి పాజిటివ్‌ వచ్చింది. తాజాగా, హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న 21 మందికి కరోనా నిర్ధారణ అయింది. అయితే, వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని బ్రేక్‌ చేయాలంటే ఖచ్చితంగా పెద్దఎత్తున పరీక్షలు చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు