కోవిడ్‌ను ఓడించిన ట్రంప్... వైద్య చికిత్స పూర్తయిందట... వైద్యుల ప్రకటన

శుక్రవారం, 9 అక్టోబరు 2020 (12:21 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల కరోనా వైరస్ బారిపడ్డారు. ఆయనకు ఈ వైరస్ సోకి శనివారంతో పది రోజులు పూర్తికానుంది. అయితే, కరోనా సోకినట్టు నిర్ధారణ అయిన తర్వాత తొలుత తన అధికార కార్యాలయంలోనే చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను ప్రత్యేక హెలికాఫ్టర్‌లో సైనిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆరోగ్యం భేషుగ్గా ఉందని పేర్కొంటూ తిరిగి వైట్‌హౌస్‌కు వచ్చారు.

దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. కోవిడ్ నిబంధనలు ఆయన తుంగలో తొక్కేశారని పలువురు ఆరోపించారు. అయితే, ఆయన మాత్రం తాను ఆరోగ్యంగా ఉన్నానని ప్రకటించి, ఈ నెల 15వ తేదీన అధ్యక్ష ఎన్నికల్లో తనతో పోటీపడుతున్న ప్రత్యర్థి జో బైడెన్‌తో జరిగే ముఖాముఖి చర్చలో పాల్గొంటానటూ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వైట్‌హౌస్‌లోనే ఆయన వైద్యుల పర్యవేక్షణలో తన కార్యక్రమాలను నిర్వహిస్తారు. 
 
ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ డాక్టర్‌ సియాన్‌ కాన్లే కీలక ప్రకటన చేశారు. ట్రంప్‌కు అందించాల్సిన చికిత్స పూర్తయినట్లు తెలిపారు. ఆయన ప్రజల ముందుకురావడం సురక్షితమేనని కూడా వైద్యులు చెప్పారు. గత శుక్రవారం నుంచే ఆయనలో ఎటువంటి లక్షణాలు లేవని తెలిపారు. వైట్‌హౌస్ చేరుకున్న నాటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. 
 
చికిత్సకు ట్రంప్ బాగా స్పందించారని, ఇచ్చిన ఔషధాల వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా కనిపించలేదని వివరించారు. ట్రంప్‌కు కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యి రేపటితో పది రోజులు పూర్తవుతుందని చెప్పారు. వైద్య బృందం అధునాతన పరీక్షలు నిర్వహిస్తోందని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు