ముఖ్యంగా, రానున్న రెండు వారాల సమయం అమెరికన్లకు అత్యంత బాధాకరమైన రోజులను కళ్లముందుంచనున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు వారాల సమయంలోనే లక్ష మంది నుంచి 2.40 లక్షల మంది వరకూ అమెరికన్లు చనిపోవచ్చని వైట్‌హౌస్ అంచనావేసింది.
'ఇది చాలా బాధను కలిగించనుంది. చాలా చాలా బాధ వచ్చే రెండు వారాల్లో కలుగుతుంది' అని వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి ప్లేగు వ్యాధిని గుర్తు చేస్తున్నదని అభివర్ణించిన ట్రంప్, "ముందు ముందు రానున్న కష్టకాలాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి అమెరికన్ సిద్ధంగా ఉండాలి" అని సూచించారు.
కాగా, ఈ కరోనా దెబ్బకు అమెరికా ఆర్థిక వ్యవస్థ సైతం కుదేలైంది. 'కరోనాను శరీరం నుంచి తొలిగించేందుకు ఏ మ్యాజిక్ వాక్సిన్ లేదా వైద్యం లేదు. కేవలం అలవాట్లను మార్చుకోవడం ద్వారా వైరస్‌కు దూరం కావచ్చు' అని వైట్‌హౌస్ కరోనా వైరస్ రెస్పాన్సివ్ టీమ్ సమన్వయకర్త డెబోరాహ్ బిర్క్స్ వ్యాఖ్యానించారు.