బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చి యావత్తు ప్రపంచాన్ని వణికిస్తోన్న కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) మరోమారు హెచ్చరించింది. కొత్త రకం కరోనా వైరస్ విషయంలో కూడా ఇప్పటి వరకూ మహమ్మారి కట్టడికి అనుసరిస్తున్న జాగ్రత్తలనే పాటించాలని, జాగ్రత్తలు పాటించకుంటే ముప్పు తప్పదని హెచ్చరించింది.
ఈ కొత్తరకం కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పటి దాకా అదుపు తప్పలేదని, ఇంత కాలం పాటించినట్లుగానే కరోనా జాగ్రత్తలు పాటిస్తే కొత్త రకం కరోనా వైరస్ ను సమర్ధంగా తిప్పి కొట్టగలమని పేర్కొంది. అజాగ్రత్త వహిస్తే ప్రమాదం తప్పదని హెచ్చరించింది.
కాగా, బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ బయటకు వచ్చిందని తెలియడంతో అన్ని దేశాలు కూడా అప్రమత్తమైపోయాయి. కొత్తరకం కరోనా వైరస్ భారత్‌లోకి రాకుండా ఉండేందుకు భారత్, బ్రిటన్ మధ్య నడిచే విమానాలను డిసెంబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది.