మహారాష్ట్రలో కరోనా విశ్వరూపం - తెలంగాణలో శాంతించిన వైరస్

గురువారం, 30 ఏప్రియల్ 2020 (08:49 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఫలితంగా బుధవారం ఒక్క రోజే ఏకంగా 32 మంది చనిపోయారు. అలాగే, 597 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపి మహారాష్ట్రలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 9915కు చేరింది. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ వైరస్ శాంతించింది. బుధవారం కేవలం ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. 
 
కరోనా వైరస్ కట్టడికి అటు కేంద్రం, ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాలైన కట్టడి చర్యలు చేపడుతున్నాయి. అయినప్పటికీ ఈ వైరస్ మహమ్మారి విశ్వరూపం దాల్చుతోంది. ఫలితంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. 
 
మరోవైపు, తెలంగాణా రాష్ట్రంలో మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గిపోయింది. గత వారం రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. బుధవారం కొత్తగా కేవలం ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. 
 
తాజా కేసులతో కలిసి మొత్తం కేసుల సంఖ్య తెలంగాణలో 1016కి చేరింది. బుధవారం 35 మందిని డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు. డిశ్చార్జ్ అయిన వారిలో 14 మంది చిన్నారులున్నారు. కోలుకున్నవారిలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన నెల రోజుల చిన్నారి కూడా ఉంది. ఈ పిల్లలకు వారి తల్లిదండ్రుల నుంచి కరోనా సోకినట్లు తెలుస్తోంది.
 
ఇది ఇలావుంటే తెలంగాణలో జిల్లాల్లో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆదివారం 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సోమవారం కేవలం రెండు కేసులు మాత్రమే నమోదు కాగా... మంగళవారం ఈ సంఖ్య స్వల్పంగా పెరిగి 6 కేసులు నమోదయ్యాయి. అయితే కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు