సెహ్వాగ్ వీర విహారం, భారీ స్కోరు దిశగా భారత్

శుక్రవారం, 28 మార్చి 2008 (13:32 IST)
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వీరవిహారం చేస్తున్నాడు. మూడో రోజు ఆట ప్రారంభమైన తర్వాత టెస్టుల్లో 14వ సెంచరీని పూర్తి చేసుకున్న సెహ్వాగ్ ఆ తర్వాత కూడా తన జోరును కొనసాగిస్తున్నాడు. మొత్తం 178 బంతులను ఎదుర్కొని 26 ఫోర్లు, ఒక సిక్సర్‌తో సెహ్వాగ్ 165 (నాటౌట్) పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు.. దక్షిణాఫ్రికా బౌలర్లు ఎట్టకేలకు భారత ఓపెనర్లలో ఒకరైన వసీం జాఫర్‌ను (73) అవుట్ చేయగలిగారు.

దీంతో.. భారత్ తొలి వికెట్‌ను 213 పరుగుల వద్ద కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన "మిస్టర్ కూల్" ద్రావిడ్ ఆచితూచి ఆడుతున్నాడు. క్రీజ్‌లో కుదురుకున్న సెహ్వాగ్‌కు ఎక్కువగా స్ట్రైక్ ఇస్తూ.. బ్యాటింగ్ చేసేలా దోహదపడుతున్నాడు. అంతకుముందు రెండో రోజు ఓవర్ నైట్ స్కోరు 82తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో భారత్ దక్షిణాఫ్రికా చేసిన 540 పరుగుల భారీ స్కోరుకు ధీటుగా స్పందించింది. సఫారీలు చేసిన స్కోరుకు భారత్ మరో 292 పరుగుల వెనుకబడి ఉంది.

వెబ్దునియా పై చదవండి