ఏపీలోని కడప జిల్లా గండికోటలో ఓ యువతి అనుమానాస్పదంగా మృతిచెందింది. ఓ యువకుడితో కలిసి పల్సర్ బైకులో గండికోటకు వచ్చిన ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ యువతిని తీసుకొచ్చిన యువకుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
సోమవారం సాయంత్రం సదరు యువతి ఒక యువకుడితో కలిసి పల్సర్ బైకుపై గండికోటకు వచ్చింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. తీరా చూస్తే ఆమె అనుమానాస్పదంగా శవమై కనిపించింది. ఈ మృతదేహాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని ప్రొద్దుటూరుకు చెందిన వైష్ణవిగా గుర్తించారు. ఆమె ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ విద్యాభ్యాసం చేస్తున్నట్టు తేలింది.
మరోవైపు, యువతిని బైకుపై తీసుకొచ్చిన యువకుడుపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె వేసుకున్న దుస్తులతోనే గొంతు బిగించి హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. వైష్ణవితో వచ్చిన యువకుడు కనిపించకుండా పోవడం, పైగా తిరిగి వెళ్లేటపుడు అతను ఒక్కడే వెళ్లడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.