టీమిండియా అతిగా అంచనా వేసుకుంది.. తప్పులు చేసింది.. కుక్

శుక్రవారం, 2 జులై 2021 (17:04 IST)
Cook
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ ముగిసింది. టెస్టు ఛాంపియన్‌షిప్‌ తుది పోరులో న్యూజిలాండ్‌ విజేతగా నిలవగా.. హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఓటమి పాలైంది. అయితే టీమిండియా ఓటమిపై ఇంకా విశ్లేషణ కొనసాగితోంది. టీమిండియా ఓటమికి గల కారణాలపై మాజీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ అలిస్టర్‌ కుక్ కూడా టీమిండియా ఓటమిపై స్పందించాడు.
 
ఫైనల్లో టీమిండియా జట్టు ఎంపికలో తప్పులు చేసిందని కుక్ అభిప్రాయపడ్డాడు. ఫైనల్ మ్యాచ్ సమయంలో వర్షం కురుస్తుందని ముందే తెలిసినా టీమిండియా ఇద్దరు స్పిన్నర్లను ఎంచుకుందని విమర్శించాడు. జట్టు ఎంపికపై భారత్ ఆత్మవిశ్వాసం ప్రదర్శించిందని, ముందుగానే జట్టును ప్రకటించిందని గుర్తు చేశాడు. టీమిండియా తమను తాము అతిగా అంచనా వేసుకుందని చెప్పాడు.
 
టీమిండియా గొప్ప జట్టు అని అన్న కుక్ … స్వింగయ్యే బంతులు ఆడలేకపోవడం టీమిండియా బలహీనత అని పేర్కొన్నాడు. ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్ కూడా లేకపోవడం టీమిండియా ఓటమికి కారణమని అభిప్రాయపడ్డాడు. అలానే న్యూజిలాండ్‌ విజయంపై కూడా అలిస్టర్‌ కుక్ స్పందించాడు. 
 
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ ముందు ఇంగ్లాండ్‌తో ఆడిన రెండు టెస్టులు న్యూజిలాండ్‌కు ప్రాక్టీస్‌లా ఉపయోగపడ్డాయని తెలిపాడు. న్యూజిలాండ్‌కు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ ఉంది కాబట్టే విజేతగా నిలిచిందని చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు