బంతిపై ఉమ్మిని రుద్దడం వద్దు.. ఐసీసీ.. సచిన్ స్పందన ఏంటంటే?

మంగళవారం, 9 జూన్ 2020 (21:23 IST)
కరోనా మహమ్మారి కారణంగా పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. క్రికెట్ రంగంలోనూ కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం వంటివి జీవితంలో భాగమైపోయేలా ప్రస్తుత పరిస్థితి కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పలు మధ్యంతర మార్పులు అమలు చేయాలని నిర్ణయించింది. 
 
ఆటగాళ్లను కరోనా బారి నుంచి రక్షించడానికి అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ తగిన విధంగా కొత్త నిబంధనలు రూపొందించింది. ముఖ్యంగా బంతిపై ఉమ్మిని రుద్దడాన్ని నిషేధించింది. తటస్థ అంపైర్ల బదులు స్థానిక అంపైర్లను ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. 
 
అంతర్జాతీయ క్రికెట్‌ను తిరిగి ఆరంభించేందుకు అన్ని బోర్డులు చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ కొన్ని మార్పులను ప్రకటించింది. ఇందులో భాగంగా బంతిపై ఉమ్మి రుద్దడం నిషేధం. ఒకవేళ బౌలర్ బంతిపై ఉమ్మిని రుద్దినట్టయితే అంపైర్లు రెండుసార్లు వార్నింగ్ ఇస్తారు. మూడో పర్యాయం కూడా అదే తప్పు చేస్తే ఫీల్డింగ్ జట్టుకు 5 పరుగుల జరిమానా విధిస్తారు. 
 
* ఓ టెస్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎవరైనా ఆటగాడు కరోనా లక్షణాలతో బాధపడుతుంటే అతడి స్థానాన్ని రిజర్వ్ బెంచ్‌లో ఉన్న ఆటగాడితో భర్తీ చేయొచ్చు. ఈ వెసులుబాటు కేవలం టెస్టులకే పరిమితం.
 
* ఏ సిరీస్‌లోనూ తటస్థ అంపైర్లు ఉండరు. ఎక్కడ మ్యాచ్ జరిగితే అక్కడి స్థానిక అంపైర్లనే మ్యాచ్‌లో వినియోగిస్తారు.
 
* టెస్టు మ్యాచ్‌లో ధరించే షర్టుపైనా, స్వెటర్ పైనా అదనపు లోగోకు అనుమతి. అయితే ఆ లోగో 32 చదరపు అంగుళాల సైజు మించకూడదు.
 
* ఓ మ్యాచ్‌లో ప్రతి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లకు అదనంగా మరో డీఆర్ఎస్ అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్, వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లో ఇవి అమలు వుంటాయని తెలుస్తోంది. 
sachin
 
కాగా బంతిపై ఉమ్మిని రుద్దడం నిషేధంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. ఉమ్మిని వాడకుండా చేయడమనేది కఠినమైన నిర్ణయమని చెప్పాడు. బంతిని మెరిపించడానికి లాలాజలం వాడాలనే విషయాన్ని చిన్నప్పటి నుంచే నేర్పిస్తారని తెలిపాడు. ఇప్పుడు హఠాత్తుగా దీన్ని ఆపేయడం కష్టమేనని చెప్పాడు. టెస్టుల్లో ఇన్నింగ్స్ లో 80 ఓవర్ల తర్వాత కొత్త బంతి అందుబాటులోకి వస్తుందని... లాలాజల నిషేధం కారణంగా బౌలర్లకు మద్దతుగా 50 ఓవర్లకే కొత్త బంతిని అందిస్తే సరిపోతుందని ఐసీసీకి సచిన్ సూచించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు