కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. టీ20ల్లో ఒకే స్టేడియంలో..

శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (12:23 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే స్టేడియంలో మూడు లేదా అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించారు. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ ఇప్పటివరకు 92 టీ20 ఇన్నింగ్స్‌లోల 3015 పరుగులు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 
 
 
ప్రస్తుతం స్వదేశంలో ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. వరుసగా హాఫ్‌ సెంచరీలు చేస్తూ దూసుకుపోతున్నాడు. బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లోనూ నాలుగో అర్థ శతకంతో మెరిశాడు. 37 బంతుల్లో 54 పరుగులు చేసిన అతడు.. జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయాడు. 
 
అయితే, ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే స్టేడియంలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ 3,015 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు ముష్ఫీకర్‌ రహీమ్, మహ్మదుల్లా ఉన్నారు. 
 
మిర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో ముష్ఫీకర్‌ 121 ఇన్నింగ్స్‌ల్లో 2,989 పరుగులు చేయగా.. మహ్మదుల్లా 130 ఇన్నింగ్స్‌ల్లో 2,813 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌ మైదానంలో 90 ఇన్నింగ్స్‌ల్లో 2,749 పరుగులు చేసి ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 
 
బంగ్లాదేశ్‌కు చెందిన మరో ఆటగాడు తమీమ్‌ ఇక్బాల్ మిర్పూర్‌ స్టేడియంలో 2,706 పరుగులు చేసి ఐదో స్థానంలో నిలిచాడు. ఇక, ఈ ఐపీఎల్‌ సీజన్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 142.30 స్ట్రెక్‌రేట్‌తో 333 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్‌ సెంచరీలున్నాయి. 
 
అత్యధిక స్కోరు 82 (నాటౌట్). ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీ రెగ్యులర్‌ కెప్టెన్ ఫాఫ్‌ డుప్లెసిస్ 422 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు