మాజీ క్రికెటర్‌ను విమానం నుండి తోసేశారు.. ఎక్కడ?

మంగళవారం, 21 మే 2019 (15:54 IST)
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ స్లాటర్‌ను విమానం నుండి దిగిపోవాలంటూ విమాన సిబ్బంది దించేశారు. స్లాటర్ మంగళవారం సిడ్నీ నుండి వాగ్గా విమానం ఎక్కాడు. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్నేహితులతో గొడవకు దిగడమే కాకుండా అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు. వీరి వాదన కారణంగా విమానం అరగంట ఆలస్యమైంది.
 
దీంతో కోపగించుకున్న తోటి ప్రయాణికులు స్లాటర్‌నను దింపేయాలంటూ కోరారు. వెంటనే స్లాటర్ బాత్రూంలోకి దూరి తలుపు పెట్టుకున్నాడు. ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీసుకొచ్చి విమానంలో నుంచి గెంటేశారు.
 
క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత స్లాటర్ ప్రస్తుతం టెలివిజన్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2019కు కూడా కామెంటేటర్‌గా సిద్ధమవుతున్నాడు. విమానంలో అసభ్యకరంగా ప్రవర్తించడంపై మైకేల్ స్లాటర్ వివరణ ఇచ్చుకున్నాడు.
 
వాగ్గా బోర్డింగ్ పాయింట్‌లో విమానం ఎక్కేందుకు వచ్చిన ఇద్దరి స్నేహితులతో వాదనకు దిగానని, ప్రయాణికులను ఇబ్బంది పెట్టినందుకు వారికి తాను క్షమాపణలు తెలుపుకుంటున్నానని వెల్లడించాడు. మైకేల్ స్లాటర్ 1993 నుంచి 2001 వరకూ ఆస్ట్రేలియా జట్టులో ప్లేయర్‌గా కొనసాగి 74 టెస్టుల్లో ఆడాడు. 2004లో తన రిటైర్మెంట్ ప్రకటించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు