ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. రెండో భార్యను హత్య చేసి, మృతదేహాన్ని ఫోటోలు తీసి మొదటి భార్యకు పంపించాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం వెంకన్నగూడలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వెంకన్నగూడకు చెందిన వానరాశి జంగయ్య హైదరాబాద్‌లో డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య ఉండగానే 15 ఏళ్ల క్రితం రజిత అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు.
మూడేళ్ల క్రితం భర్త నుంచి రజిత విడిపోయింది. మొదటి భార్యతో వెంకన్న ఉంటున్నాడు. రజిత ఆచూకీ తెలుసుకుని సోమవారం ఆమెను వెంకన్నగూడకు తీసుకొచ్చాడు. గ్రామపెద్దల సమక్షంలో మంగళవారం ఉదయం మాట్లాడారు. ఇద్దరం కలిసి ఉందామని రజితతో జంగయ్య చెప్పగా.. ఆమె అంగీకరించలేదు.
రజితను ఒప్పించేందుకు జంగయ్య యత్నించాడు. అంగీకారం తెలపకపోవడంతో మద్యం మత్తులో ఆమె మెడకు చున్నీ బిగించి హతమార్చాడు. చావలేదనే అనుమానంతో అక్కడే ఉన్న సిమెంట్ రాయితో ఛాతీపై బలంగా కొట్టాడు. ఆ తర్వాత ఫొటోలు తీసి తన మొదటి భార్యకు పంపి.. ఇలా చంపానని చెప్పాడు.
అనంతరం గ్రామ సర్పంచ్ నర్సింలుకు సమాచారమిచ్చి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.