మోతేరాలో కీలక పోరు : గెలిస్తేనే టైటిల్ రేసులో నిలబడేది!
గురువారం, 18 మార్చి 2021 (09:53 IST)
అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో జరుగుతున్న ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా గురువారం నాలుగో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్‌లో పర్యాటక ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టైటిల్ గెలవాంటే.. భారత జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది.
ఇందుకు ముఖ్యంగా.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేయాలన్న ఆలోచన నుంచి టీమిండియా బయటపడాలి. ఎందుకంటే జరిగిన మూడు మ్యాచ్‌ల్లో టాస్ నెగ్గిన జట్టు అలవోకగా లక్ష్యాన్ని ఛేదించగలగడమే! అయితే మొదట బ్యాటింగ్ అయినా, ఛేదన అయినా అద్భుతంగా ఆడాల్సి ఉంటుందని కెప్టెన్ కోహ్లీ తరచుగా చెబుతుంటాడు.
మరికొద్ది నెలల్లో స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో తొలుత బ్యాటింగా, బౌలింగా అన్న విషయంతో సంబంధం లేకుండా విరాట్ బృందం విజృంభించాల్సిందే. ఈ సిరిస్‌లో జరిగిన మూడు పోటీల్లో రెండింటిలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఓటమి చవిచూడడం గమనార్హం. ఈ రెండు మ్యాచ్‌ల్లో పవర్ ప్లేలో భారీగా పరుగులు చేయడంలో జట్టు విఫలమైంది.
మార్క్, ఆర్చర్ మెరుపు వేగంతో చేస్తున్న బౌలింగ్‌తో మొదటి ఆరు ఓవర్లలో పరుగులు సాధించడం టీమిండియాకు గగనమవుతోంది. కేఎల్ రాహుల్ పూర్తిగా నిరాశపరచడం జట్టును దెబ్బ తీస్తోంది. అయినా కోహ్లీ మాత్రం అతడివైపే మొగ్గు చూపుతున్నాడు. కానీ, చావోరేవోగా మారిన ఈ మ్యాచ్‌లో రాహుల్‌ను ఆడిస్తారా అన్నది సందేహమే.
మరోవైపు, గత మ్యాచ్ అందుకున్న పెద్ద విజయంతో ఇంగ్లండ్‌లో ఆత్మవిశ్వాసం ఉరకలేస్తోంది. ఎదురు దాడే లక్ష్యంగా జోస్ బట్లర్ భారత బౌలర్లలో గుబులు రేపుతున్నాడు. టెస్ట్‌లలో ఘోరంగా విఫలమైన బెయిర్ స్టో గత మ్యాచ్‌ద్వారా మళ్లీ ఫామ్‌లోకి రావడం ఇంగ్లండ్‌కు శుభసూచకం. టీ20లలో నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్ కూడా కుదురుకుంటే ఇంగ్లండ్‌కు తిరుగుండబోదు.