ఆసియా కప్ : దాయాదులపై రెచ్చిపోయిన భారత్ బ్యాటర్లు... 356 పరుగుల భారీ స్కోరు

సోమవారం, 11 సెప్టెంబరు 2023 (18:50 IST)
ఆసియా కప్ టోర్నీలో భాగంగా, సోమవారం చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించినప్పటికీ భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. ఫలితంగా 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరు చేశారు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు సెంచరీలతో విరుచుకుపడ్డారు. ఫలితంగా పాక్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. 
 
ఆదివారం జరగాల్సిన ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రిజర్వు డే అయిన సోమవారానికి మార్చారు. అయినప్పటికీ వర్షం అంతరాయం కలిగించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ 56, శుభమన్ గిల్‌ 58 చొప్పున పరుగులు చేసి మంచి శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం కల్పించారు. రోహిత్ శర్మ అయితే, సిక్సులతో విరుచుకుపడ్డారు. మొత్తం 49 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 4 సిక్స్‌లు ఆరు ఫోర్ల సాయంతో 56 పరుగులు చేశారు. 
 
ఓపెనర్లు ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో వారిద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కోహ్లీ 94 బంతుల్లో మూడు ఫోర్లు, 9 ఫోర్ల సాయంతో 122 పరుగులు చేయగా, రాహుల్ 106 బంతుల్లో 2 సిక్స్‌లు 12 ఫోర్ల సాయంతో 111 పరుగులు చేసి క్రీజ్‌లో నాటౌట్‌గా నిలిచారు. ఫలితంగా 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 7.12 రన్ రేటుతో 356 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షహీన్ ఆఫ్రిది, షదాబ్ ఖాన్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు