జింబాబ్వే వర్సెస్ ఇండియా : నేడు రెండో వన్డే మ్యాచ్

శనివారం, 20 ఆగస్టు 2022 (08:18 IST)
జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత్ శనివారం రెండో వన్డే మ్యాచ్ ఆడనుంది. హరారే వేదికగా గురువారం జరిగిన తొలి వన్డేలో పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్... మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 
 
శనివారం హరారే వేదికగానే జింబాబ్వే - భారత్ జట్ల మధ్య రెండో మ్యాచ్‌ జరగనుంది. ఇందులోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా జింబాబ్వే పుంజుకోవడం ఖాయం. బంగ్లాదేశ్‌తో జింబాబ్వే పోరాటం మరిచిపోకూడదు.
 
తొలి వన్డేలో భారత బౌలర్లు, ఓపెనర్లు అద్భుతంగా రాణించినా.. జింబాబ్వే లోయర్‌ ఆర్డర్‌ను కంట్రోల్‌ చేయడంలో మాత్రం కాస్త విఫలమైనట్లు ఉంది. కెప్టెన్‌ చకబ్వాతోపాటు సికిందర్‌ రజాను త్వరగానే పెవిలియన్‌కు చేర్చారు. అయితే తొమ్మిదో వికెట్‌కు బ్రాడ్ ఇవాన్స్‌-ఎన్‌గరవ 70 పరుగులు జోడించడం విశేషం. 
 
భారత బౌలర్లు ఆరంభంలో ఉన్న పట్టును విడిపించారు. లేకపోతే తొలి వన్డేలో జింబాబ్వే 150 పరుగుల్లోపే కుప్పకూలాల్సింది. దీంతో ఆఖరికి 189 పరుగులకు ఆలౌటై.. కాస్త గౌరవప్రదమైన స్కోరును భారత్‌కు లక్ష్యంగా నిర్దేశించింది.
 
ఈ మ్యాచ్‌లో దీపక్‌ చాహర్‌ (3/27) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ప్రసిధ్‌ (3/50) పరుగులు ఎక్కువ ఇచ్చినా వికెట్లు తీశాడు. ఇక అక్షర్‌ అయితే (3/24) కీలక సమయంలో వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిరాజ్‌ ఒక వికెట్‌ మాత్రమే తీసి కాస్త నిరుత్సాహపరిచాడు. బ్యాటింగ్‌లో ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. ఇదో జోరును రెండో వన్డే మ్యాచ్‌లోనూ కొనసాగించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు