యధాతథంగా బ్రిస్బేన్ టెస్ట్ - సిడ్నీ టెస్టులో 407 రన్స్ టార్గెట్

ఆదివారం, 10 జనవరి 2021 (11:58 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య జరగాల్సిన నాలుగో టెస్టు నిర్వహణపై కమ్ముకున్న నీలినీడలు వీడిపోయాయి. ఈ టెస్టు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం యధావిధిగా జరుగుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. 
 
ఈ టెస్ట్ మ్యాచ్ జరిగే బ్రిస్బేన్ స్టేడియం ఉన్న క్వీన్స్‌ల్యాండ్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్డౌన్ అమలు చేస్తూ కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. దీంతో ఈ టెస్టు నిర్వహణపై సందిగ్దత నెలకొంది.
 
పైగా, ఈ మ్యాచ్ ఆడే విషయమై శనివారం వరకూ తన నిర్ణయాన్ని ప్రకటించని బీసీసీఐ, ఎట్టకేలకు ఓ మెట్టు దిగి, మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. ఇదేసమయంలో మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక్క రోజు కూడా తమ ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో ఉండబోరని, వెంటనే ఇండియాకు వెళ్లే ఏర్పాట్లు చేయాలని షరతు విధించింది.
 
బ్రిస్బేన్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక్క రాత్రి కూడా అక్కడ నిద్ర చేయబోమని స్పష్టం చేస్తూ, ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు అందుబాటులో ఉండే తొలి విమానంలోనే తమను పంపించి వేయాలని కోరినట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 
 
ఇక టీమిండియా స్వదేశానికి చేరుకున్న తర్వాత, ఇంగ్లండ్ జట్టు రానున్న సంగతి తెలిసిందే. అయితే, ఇంగ్లండ్, ఇండియా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించరాదని కూడా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.
 
రెండు దేశాల క్రికెటర్లూ కఠినమైన నిబంధనల మధ్య బయో బబుల్‌లో ఉండి మ్యాచ్‌లు ఆడతారని, అటువంటి పరిస్థితుల్లో వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టేలా రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేమని, అందువల్లే వీక్షకులను అనుమతించ కూడదని నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. 
 
మరోవైపు, సిడ్నీ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప‌టిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్‌ను 244 ప‌రుగులకు ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియాకు 94 పరుగుల ఆధిక్యం ల‌భించింది. 
 
ఇక రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్ (13), పకోవ్‌స్కీ ( 10) వెంట‌వెంట‌నే  ఔట‌యిన‌ప్ప‌టికీ స్మిత్‌( 81), ల‌బుషేన్ (73) అద్భుత‌మైన ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాని ప‌టిష్ట స్థితిలో నిలిపారు. 
 
ముఖ్యంగా స్మిత్‌.. భార‌త బౌల‌ర్స్‌పై ఎదురు దాడి చేస్తూ స్కోరు వేగాన్ని పెంచాడు. ఇక సెంచ‌రీకు చేరువ‌వుతున్న స‌మ‌యంలో అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
 
ఇక మాథ్యూ వేడ్‌( 4) తొంద‌ర‌గానే పెవీలియ‌న్ చేరినప్ప‌టికీ, ఆల్‌రౌండ‌ర్ గ్రీన్(84), కెప్టెన్ టిమ్ పైన్(39) మాత్రం బౌండరీల‌తో రెచ్చిపోయారు. ఫోర్స్, సిక్స‌ర్ల‌తో సిడ్నీ గ్రౌండ్‌ని హోరెత్తించారు. టీ స‌మ‌యానికి గ్రీన్ ఔట్ కావ‌డంతో 312 ప‌రుగుల‌కు ఇన్నింగ్స్‌ను కెప్టెన్ ఫైన్ డిక్లేర్ చేశాడు. 
 
దీంతో భార‌త్ మూడో టెస్ట్ మ్యాచ్ గెల‌వాలంటే 407 ప‌రుగులు చేయాల్సి ఉంది. భార‌త బౌలర్స్‌లో అశ్విన్ , సైనీలు చెరో రెండు వికెట్స్ తీయ‌గా, బుమ్రా, సిరాజ్‌ల‌కు చెరో వికెట్ ద‌క్కింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు