ఆప్ఘనిస్థాన్‌తో నామమాత్రపు మ్యాచ్.. అయినా చుక్కలు కనిపించాయ్

బుధవారం, 26 సెప్టెంబరు 2018 (10:22 IST)
దుబాయ్ వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన టీమిండియా మ్యాచ్ టైగా ముగిసింది. మంగళవారం జరిగిన సూపర్-4 ప్రాధాన్యత లేని మ్యాచ్ అయినప్పటికీ టీమిండియాకు ఆప్ఘనిస్థాన్ చుక్కలు చూపించింది. భారత జట్టును ఆప్ఘనిస్థాన్ జట్టు ఓటమి అంచులదాకా తీసుకొచ్చింది.


అయితే భారత్ ధీటుగా పోరాటంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఇప్పటికే భారత్ ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకోగా.. బుధవారం అబుదాబి వేదికగా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ తలపడనున్నాయి. ఇవాల్టి మ్యాచ్‌లో గెలిచిన జట్టు శుక్రవారం ఫైనల్లో భారత్‌తో తలపడుతుంది.
 
ఈ నేపథ్యంలో మంగళవారం ఆప్ఘన్‌- భారత్ మ్యాచ్‌లో ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆప్ఘనిస్థాన్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. షహజాద్‌ 124 పరుగులతో చెలరేగితే.. మొహమ్మద్‌ నబీ 64 పరుగులతో ఆదుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ 60 పరుగులు, అంబటి రాయుడు 57 పరుగులు చేసి పరవాలేధనిపించారు.
 
వీరిద్దరు తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించారు. రాయుడు, రాహుల్‌ పెవిలియన్‌కు చేరాక వచ్చిన ధోని, పాండేలు… చెరో ఎనిమిది పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత 19 పరుగులకే జాదవ్‌ రనౌట్‌ కాగా… 44 పరుగులు చేసిన కార్తీక్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. ఆ వెంటనే అనుభవం లేని బ్యాట్స్‌మెన్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. 
 
చివరి ఓవర్లో విజయానికి భారత్‌కు ఏడు పరుగులు అవసముండగా.. జడేజా క్రీజ్‌లో ఉన్నాడు. నాలుగు బంతుల తర్వాత స్కోర్లు సమమయ్యాయి. మరో రెండు బంతుల్లో సింగిల్‌ తీయాల్సి ఉండగా జడేజా ఔటవ్వడంతో.. మ్యాచ్‌ టైగా ముగిసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు