ఆస్ట్రేలియా బౌలర్లను భారత బ్యాట్స్‌మెన్లు ఓ ఆట ఆడుకున్నారు. కంగారులకు పట్టపగలు చుక్కలు చూపించారు. సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లలో ఇద్దరు సెంచరీలతో కదం తొక్కగా, మిగిలినవారు తమవంతు సాయం చేశారు. ఫలితంగా భారత తన తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 622 పరుగుల చేసి డిక్లేర్ చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్న విషయంతెల్సిందే. ఆ తర్వాత భారత ఓపెనర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పుజారా, రిషబ్ పంత్‌లు నిలకడగా రాణించారు. ఈ క్రమంలో పుజారా 193, పంత్ 159 (నాటౌట్) పరుగులతో రాణించడంతో భారత్ అలవోకగా 600 పరుగుల మార్క్ చేరుకుంది.
లంచ్ విరామం తర్వాత పంత్‌తో పాటు జడేజా క్రీజులో దూకుడుగా ఆడాడు. జట్టు స్కోరు 418 పరుగుల వద్ద పుజారా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా 622 స్కోరు వద్ద ఔటయ్యాడు. సహనంతో బ్యాటింగ్ చేస్తూ మరో ఎండ్‌లో పంత్‌కు సహకరించాడు. కమిన్స్ వేసిన 164వ ఓవర్లో జడ్డూ ఒక్కడే ఏకంగా నాలుగు ఫోర్లు బాది 16 పరుగులు రాబట్టాడు. టీ20 క్రికెట్ తరహాలోనే వారిద్దరి బ్యాటింగ్ సాగింది.
ఈ క్రమంలో జట్టు స్కోరు 622 పరుగులకు చేరుకోగానే కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా పది పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్లు హర్రీస్ (19), ఖవాజా (5) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.