కట్టుకున్న భర్తతో పిల్లలు పుట్టించుకున్నావు.. ఇపుడు పిల్లలు లేని బావకు కూడా సంతాన భాగ్యం కల్పించాలంటూ ఇంటికొడలిపై అత్తామామలు తీవ్రంగా ఒత్తిడి చేస్తూ వేధింపులకు పాల్పడ్డారు. అయితే, ఆ వివాహిత అందుకు అంగీకరించకపోవడంతో అత్తామామలు కలిసి ఆమెను ఓ గదిలో బంధించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను రక్షించి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ అమానవీయ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో వెలుగు చూసింది. 
	 
	ఈ వివరాలను పరిశీలిస్తే, పోలవరానికి చెందిన ఓ యువతికి జంగారెడ్డి గూడెంకు చెందిన ఓ యువకుడితో రెండేళ్ళ క్రితం వివాహమైంది. ఆమె ఓ యేడాది క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే భర్త సోదరుడికి పిల్లలు లేకపోవడంతో అతడితో కలిసి వారసుడికి జన్మనివ్వాలని అత్తమామలు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆమె భర్తను మరో ఊరికి పంపించి వివాహితను చిత్రహింసలకు గురిచేశారు. 
	 
	బిడ్డతో సహా గదిలో బంధించి మంచినీరు, భోజన పెట్టకుండా చిత్రహింసలకు గుర్తి చేశారు. దీనిపై సమాచారం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు, పోలీసుల సాయంతో కలిసి జంగారెడ్డి గూడెంకు వచ్చి తలుపులు బద్ధలుకొట్టి వివాహితను బయటకు తీసుకొచ్చారు. అలాగే, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.