'కంగారు' పెట్టిన ధోనీని క్షమించి వదిలేశాం.. అందుకే ఓడిపోయాం : ఆసీస్ కోచ్

శనివారం, 19 జనవరి 2019 (13:06 IST)
వన్డే సిరీస్‌లో తమ జట్టును కంగారుపెట్టిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తమ ఆటగాళ్లు క్షమించి వదిలేశారనీ, అందుకే వన్డే సిరీస్‌ను కోల్పోయినట్టు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ క్షమించి వదిలివేయడం అంటే.. ధోనీ పలుమార్లు ఎల్బీగా ఔటైనప్పటికీ తమ ఆటగాళ్లు అప్పీల్ చేయకుండా మిన్నకుండి పోయారనీ, అందుకే తాము తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
కంగారు గడ్డపై ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఫలితంగా సరికొత్త చరిత్రను భారత్ లిఖించింది. ఈ విజయంలో మాజీ కెప్టెన్ ధోనీ అత్యంత కీలకపాత్రను పోషించాడు. దీనిపై ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ స్పందిస్తూ, క్రికెట్ ఆట ఆడటమంటే ఏంటో ధోనీ నేర్పించాడని ఒక్క ముక్కలో చెప్పేశాడు. 
 
ధోనీకి పలు సందర్భాల్లో అవకాశాలు ఇవ్వడం వల్లే తాము ఓడిపోయామన్నారు. ముఖ్యంగా, చివరి వన్డే మ్యాచ్‌లో ధోనీ స్కోరు 0, 74 పరుగుల వద్ద ఉండగా, అవుట్ అయ్యే అవకాశాలున్నా ఆసీస్ ప్లేయర్లు సరిగా వినియోగించుకోలేకపోయారని విమర్శించాడు. ఈ వన్డే సిరీస్‌లో ధోనీ 37 ఏళ్ల వయస్సులోనూ స్టంప్‌ల మధ్య అంత వేగంగా కదలడం చూసి ఆసీస్ యువ క్రికెటర్లు చాలా నేర్చుకోవాలని సలహా ఇచ్చాడు. 
 
తొలి బంతికే ధోనీ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్‌ జారవిడిచాడు. దాంతోపాటు మరోసారి అప్పిల్‌ చేయకపోవడంతో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. సిడిల్‌ వేసిన 39వ ఓవర్‌లో బంతి ధోని బ్యాట్‌ ఎడ్జ్‌కి తగిలి కీపర్‌ అలెక్స్‌ క్యారీ చేతిలో పడింది. కానీ ఆసీస్‌ ఫీల్డర్లు అప్పీల్‌ చేయలేదు. ఇలా ధోనీ 2 సార్లు అవుట్ నుంచి తప్పించుకున్నాడని లాంగర్ గుర్తుచేశాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు