ప్రపంచ కప్ : తొలి సెమీస్ పోరుకు సిద్ధమైన వాంఖడే స్టేడియం... టాస్ గెలిస్తే బ్యాటింగే...

మంగళవారం, 14 నవంబరు 2023 (14:32 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ కోసం కోట్లాది మంది భారతీయులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగే వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయమని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. 
 
ఎందుకంటే ఇప్పటివరకూ ఈ ప్రపంచకప్‌లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇక్కడ రెండు మ్యాచ్‌లలో ఓడిన దక్షిణాఫ్రికా.. ఇంగ్లాండ్‌పై 399/7, బంగ్లాదేశ్‌పై 382/5 పరుగులు సాధించింది. శ్రీలంకపై భారత జట్టు 357/8 స్కోరు సాధించింది. ఆస్ట్రేలియాపై అప్ఘనిస్థాన్ 291/5 స్కోరు చేయగా.. ఛేదనలో మ్యాక్స్‌వెల్ అద్భుత ద్విశతకంతో కంగారూ జట్టు లక్ష్యాన్ని చేరుకుంది.
 
బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్ ఈ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసే జట్టుకే ఎక్కువ విజయావకాశాలుంటాయి. మొదట బ్యాటింగ్ భారీ స్కోరు చేయొచ్చు. ఈ ఎర్రమట్టి పిచ్ ఆట సాగుతున్నా కొద్దీ పేసర్లు, స్పిన్నర్లకూ అనుకూలించే అవకాశం ఉంది. దీంతో ఛేదనలో పరిస్థితులు బౌలింగ్‌కు అనువుగా మారే ఆస్కారముంది.
 
మరోవైపు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీస్ జరిగే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ బౌలింగ్, బ్యాటింగ్‌కు సమానంగా సహకరించే అవకాశాలున్నాయి. ఈ టోర్నీలో ఇక్కడ మొదట బంగ్లాదేశ్‌పై 229 పరుగులు చేసిన నెదర్లాండ్స్.. అనంతరం ప్రత్యర్థిని 142కే ఆలౌట్ చేసింది. మరో మ్యాచ్‌లో మొదట బంగ్లా 204 చేయగా.. పాకిస్థాన్ 32.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. 
 
ఇక దక్షిణాఫ్రికాపై భారత్ 326/5 భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బౌలింగులో చెలరేగి సఫారీ జట్టును 83కే కుప్పకూల్చింది. పాకిస్థాన్‌పై ఆసీస్ 337/9 స్కోరు చేసి 93 పరుగుల తేడాతో గెలిచింది. ఈ స్కోర్లు చూస్తే ఇక్కడి పిచ్ మొదట బ్యాటింగ్‌కు, రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కుప సహకరించేలా కనిపిస్తోంది. అయితే బలమైన బౌలింగ్ ఉంటే మొదట కూడా ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు