భారత క్రికెట్ జట్టు నుంచి యువరాజ్ సింగ్‌ను తప్పించారు. విశ్రాంతి పేరుతో సెలెక్టర్లు జట్టుకు దూరంగా ఉంచారు. ఇది ధోనీపై ఒత్తిడిని మరింత పెంచింది. టీమ్‌లో సీనియర్ మోస్ట్ ప్లేయర్స్ అయిన ఈ ఇద్దరిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న ఒత్తిడి అటు బోర్డు, ఇటు సెలక్టర్లపై పెరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెస్కే ప్రసాద్ అండ్ టీమ్ ఒకరిని తప్పించేసింది.
అంతేకాదు ధోనీ 2019 వరల్డ్‌కప్ వరకు ఉంటాడా? అని అడిగితే.. ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఎమ్మెస్కే తమ ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాడు. చూద్దాం.. చూద్దాం.. అతనో లెజెండ్. అతని గురించి విషయాలు పబ్లిగ్గా చెప్పలేం. కానీ ధోనీ కోసం ఓ ప్లాన్ ఉంది అని అతను స్పష్టంచేశాడు. టీమ్ ఎంపిక అనగానే ధోనీ ఇక ఏమాత్రం ఆటోమెటిక్ చాయిస్ కాదని కూడా ఎమ్మెస్కే అన్నాడు.
యువీని తొలగించడంపై మరో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు ప్రసాద్. వరల్డ్‌కప్ వరకు కొత్త రొటేషన్ పాలసీని అనుసరించనున్నట్లు అతను చెప్పాడు. ఇప్పటికే 25 మంది ప్లేయర్స్‌ను గుర్తించినట్లు వెల్లడించాడు. అదేసమయంలో చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫిట్నెస్, ఫీల్డింగ్ ఆశించినట్లుగా లేదని అన్న ప్రసాద్.. పరోక్షంగా యువీని తొలగించడానికి మరో కారణాన్ని కూడా చెప్పాడు.