ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత వివిధ క్రికెట్ జట్లకు చెందిన ప్రధాన కోచ్‌లతో పాటు చీఫ్ సెలెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. టీమిండియాకు కొత్త కోచ్ కోసం ఇప్పటికే బీసీసీఐ నోటిఫికేషన్ జారీచేసింది. అదేసమయంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన సెలెక్టర్ బాధ్యతల నుంచి ఇంజమామ్ ఉల్ హక్ కూడా వైదొలగారు. అయితే, పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆదేశిస్తే మాత్రం తిరిగి బాధ్యతలు స్వీకరిస్తానని స్పష్టంచేశారు.
అదేసమయంలో వచ్చే సెప్టెంబరు నెలలో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్, 2020లో ఐసీసీ టీ20 ప్రపంచకప్, 2023లో ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో పీసీసీ కూడా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది.
దీన్ని ముందుగానే గ్రహించిన హక్.. తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పీసీబీ ఛైర్మన్ ఎహ్‌సన్‌మణి, మేనేజింగ్ డైరెక్టర్ వసీమ్ ఖాన్‌తో వేర్వేరుగా మాట్లాడానని.. అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపానన్నారు. ఏది ఏమైనప్పటికి అన్నీ పాక్ క్రికెట్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే చేశానని.. అభిమానులు తనను అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు ఇంజమామ్ తెలిపారు.