విదేశీ గడ్డపై ఐపీఎల్ 2020 టోర్నీ?

శుక్రవారం, 3 జులై 2020 (15:57 IST)
స్వదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఈ వైరస్ కారణంగా అనేక క్రీడా పోటీలను వాయిదావేయడం జరిగింది. అలాంటి వాటిలో కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒకటి. వాస్తవానికి ఈ టోర్నీ మార్చి నెలాఖరులో ప్రారంభమై మే నెలలో ముగియాల్సివుంది. కానీ, కరోనా వైరస్ కారణంగా వాయిదాపడింది. ఇపుడు కూడా దేశంలో కరోనా వైరస్ ఏమాత్రం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో ఈ టోర్నీని విదేశీ గడ్డపై నిర్వహించాలని భావిస్తున్నారు. 
 
కరోనా వైరస్‌ అదుపులోకి వస్తే దేశంలోనే లీగ్‌ను నిర్వహించడానికే తొలి ప్రాధాన్యమని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. సాధ్యం కాని పక్షంలో యూఏఈ లేదా లంకకు తరలించే అవకాశం ఉందన్నారు. 'వేదికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దేశంలో పరిస్థితులు ఇప్పుడైతే అనుకూలంగా లేవు. విదేశాలకు తరలించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. యూఏఈ లేదా లంకలో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారు' అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
కాగా, ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించాలనుకుంటే వేదిక గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ అభిప్రాయపడ్డారు. వైరస్‌ తీవ్రత తగ్గకపోతే విదేశాలకు తరలించడం తప్ప మరో దారిలేదు. ప్రేక్షకులను అనుమతించక పోతే ఎక్కడైతే ఏంటి అని ఆయన ప్రశ్నించారు. మొత్తంమీద టోర్నీ నిర్వహణపై వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు