మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి ఆరోపణల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రక్షాళనకు ఏర్పాటైన జస్టిస్ లోథా కమిటీ బీసీసీఐ సెలెక్టర్లపై సంచలన ఆరోపణలు చేసింది. ఔత్సాహిక, ప్రతిభావంతులైన క్రికెటర్లు జట్టులోకి ఎంపిక కావాలంటే.. వారి తల్లులు సెలక్టర్లకు లైంగికవాంఛ తీర్చాలని సెలెక్టర్లు కోరుతున్నారనీ, ఈ విషయం తెలిసినప్పటికీ.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఏమీ తెలియనట్టుగా వ్యవహరిస్తోందని జస్టీస్ లోథా కమిటీ సమర్పించిన తనివేదికలో పేర్కొంది.
ఈనెల 9న లోథా ప్యానెల్‌తో జరిగిన సమావేశంలో శంకర్ నారాయణన్ సెలెక్టర్లపై ఈ నిందారోపణలు చేసినట్టు బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే వెల్లడించారు. సెలెక్టర్లు చేస్తున్న అవినీతి, అక్రమాలపై బీసీసీఐ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కూడా నారాయణన్ అన్నట్టు షిర్కే బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌కు ఈమెయిల్ ద్వారా తెలిపారు.
లోథా ప్యానెల్ ముందు ఈనెల 9న బీసీసీఐ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆ సమయంలో పార్లమెంటు సమావేశాలు ఉండటంతో ఎంపీ అయిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. బోర్డు తరపున కార్యదర్శి అజయ్ షిర్కే ఒక్కరే హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి 14 పాయింట్ల నివేదికను షిర్కే బీసీసీఐ చీఫ్‌కు పంపారు.
'ఔత్సాహిక యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలంటే వారి తల్లులను తమ లైంగిక వాంఛ తీర్చాలని సెలెక్టర్లు కోరుతున్నారు. వారు అనైతిక, అక్రమాలకు పాల్పడుతున్నా బీసీసీఐ మౌన ప్రేక్షకుడిలా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సెలెక్టర్లు తప్పు చేస్తున్నప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లేద'ని శంకర నారాయణన్ చెప్పినట్టు షిర్కే మెయిల్‌లో వివరించారు.
అయితే, ఈ ఆరోపణలను ఖండిచినట్టు షిర్కే వెల్లడించారు. బీసీసీఐ చరిత్రలో ఇలాంటివి జరిగినట్టు ఎప్పుడూ తమ దృష్టికి రాలేదని నారాయణన్‌తో చెప్పినట్టు తన నివేదికలో తెలిపారు. సెలెక్టర్లందరూ ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతున్నారంటూ నారాయణన్ చేసిన ఆరోపణలు వాస్తవం దూరమని, అర్థరహితమైనవని షిర్కే చెప్పారు. కాగా.. దీనిపై స్పందించేందుకు శంకర నారాయణన్ నిరాకరించారు.