అనుకున్నదొక్కటి.. అవుతుందొక్కటి.... మాంచెష్టర్‌కు వీడని వర్షం ముప్పు...

బుధవారం, 10 జులై 2019 (09:20 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా, మంగళవారం మాంచెష్టర్ వేదికగా తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ - న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత కివీస్ బ్యాటింగ్‌కు దిగగా 46.1 ఓవర్ల అనంతరం వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్పటికి కివీస్ స్కోరు 211/5. అయినప్పటికీ వర్షం వీడక పోవడంతో మ్యాచ్‌ను రిజర్వు డే అయిన బుధవారానికి వాయిదావేశారు. 
 
అయితే, మాంచెష్టర్‌కు వర్షం ముప్పు తొలగిపోలేదని బ్రిటన్ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నిజానికి తొలి సెమీ ఫైనల్ ఫలితం మంగళవారమే తేలిపోవాల్సివుండగా వరుణుడు కారణంగా బుధవారానికి వాయిదాపడింది. ఒకవేళ నేడు కూడా వర్షం పడి ఆటకు అంతరాయం కలిగితే భారత అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
 
బ్యాటింగ్‌కు సహకరించని పిచ్ వర్షం తర్వాత మరింత మందకొడిగా మారే అవకాశం ఉంది. ఫలితంగా ఎంత బలంగా బాదినా బంతి బౌండరీకి వెళ్లడం కష్టమే. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బౌండరీలు ఆశించడం అత్యాశే అవుతుంది. ఫలితంగా ఛేజింగ్ కష్టతరంగా మారొచ్చు. బుధవారం ఆట కొనసాగితే కివీస్ స్కోరు గరిష్టంగా 250 పరుగులకే చేరొచ్చు. సాధారణ పరిస్థితుల్లో, ముఖ్యంగా టీమిండియాకు ఇది పెద్ద సమస్యేమీ కాదు. అయితే, వర్షం కారణంగా పిచ్ జీవం కోల్పోవడమే ఇప్పుడు అసలు సమస్య. ‌బౌలింగ్ లైనప్ బలంగా ఉన్న న్యూజిలాండ్‌ను ఈ పరిస్థితుల్లో ఎదుర్కోవడం కష్టమే అవుతుంది.
 
వర్షం పడకుండా ఆట మళ్లీ కొనసాగితే ఎలాగోలా నెట్టుకు రావొచ్చు. ఒకవేళ నేడు కూడా వర్షం పడి డక్‌వర్త్‌-లూయిస్‌ పద్ధతి అమల్లోకి వస్తే మాత్రం కోహ్లీసేనకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఓవర్లు కుదించినా భారత్ ఎదుట కొండంత లక్ష్యం ఉండే అవకాశాలున్నాయి. కాబట్టి గుడ్డిలో మెల్లలా.. వరుణుడు అడ్డం రాకుండా ఆట కొనసాగితే భారత్‌ కొంత వరకు ఇబ్బందుల నుంచి బయటపడుతుంది. లేదంటే టఫ్ ఫైట్ తప్పదన్నట్టే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు