ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ విజేత ఎవరో?

ఆదివారం, 14 నవంబరు 2021 (11:15 IST)
దుబాయ్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ తుదిపోరు ఆదివారం రాత్రి జరుగనుంది. ఈ పోరులో చిరకాల ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. సెమీఫైనల్స్‌లో తమ ప్రత్యర్థులపై ఈ రెండు జట్లు అసమాన పోరాటంతో అభిమానులను మంత్రముగ్ధులను చేశాయి. 
 
భారత్‌ ఓటమితో టోర్నీలో మజా లేదనుకున్న ఫ్యాన్స్‌కు ఈ రెండు జట్ల సూపర్‌ షోతో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. బలాబలాల్లోనూ రెండు జట్లూ సై అంటే సై అనే రీతిలో ఉండడంతో దుబాయ్‌ మైదానంలో హోరాహోరీ పోరు తప్పదని అంతా ఆశిస్తున్నారు. 
 
2010లో ఓసారి ఫైనల్‌కు చేరిన ఆసీస్‌ ఈసారి అంచనాలకు మించే రాణించింది. కివీస్‌ తొలిసారిగా ఈ ఫార్మాట్‌లో తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఒకేసారి తలపడగా కివీస్‌ గెలిచింది. 
 
ఐసీసీ టోర్నీ ఫైనల్లో ఒకేసారి (2015 వరల్డ్‌కప్‌) ఎదురుపడ్డాయి. ఆ సమయంలో ఆసీస్‌ నెగ్గగా.. అప్పటి నుంచి ఈ జట్టు మరో టోర్నీ గెలవలేదు. అయితే ఇరుదేశాల అభిమానులు ఈ మ్యాచ్‌ను వీక్షించాలనుకుంటే తెల్లవారుజామునే మేల్కో వాల్సిందే. 
 
ఈ మ్యాచ్‌లో పైచేయి సాధించాలంటే ఓవరాల్‌గా ఇరు జట్ల ఓపెనర్లు రాణించాల్సివుంది. పాక్‌తో మ్యాచ్‌లో అఫ్రీది ఇన్‌స్వింగర్‌కు ఫించ్‌ తొలి ఓవర్‌లోనే వెనుదిరిగినా.. కివీస్‌పై ఫామ్‌ చూపిస్తుంటాడు. చివరి రెండు ఇన్నింగ్స్‌లో వార్నర్‌ అదరగొట్టాడు. 
 
ఇక ఫైనల్లోనూ అతడి బ్యాట్‌ గర్జిస్తే కివీస్‌కు కష్టాలు తప్పవు. అయితే మిడిలార్డర్‌లో మ్యాక్స్‌వెల్‌, స్మిత్‌ ఏమాత్రం ప్రభావం చూపకపోవడం ఆందోళన కలిగిస్తోంది. డెత్‌ ఓవర్లలో చెలరేగేందుకు స్టొయినిస్‌, వేడ్‌ సిద్ధంగా ఉన్నారు. 
 
బౌలింగ్‌లో లెగ్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా ఇప్పటికే 12 వికెట్లు తీయగా.. ఎప్పటిలాగే మధ్య ఓవర్లలో కివీస్‌ బ్యాటర్స్‌ను కట్టడి చేయాలని భావిస్తున్నారు. ఇక పేస్‌ త్రయం స్టార్క్‌, కమిన్స్‌, హాజెల్‌వుడ్‌ తొలిసారిగా కివీస్‌తో టీ20 మ్యాచ్‌ ఆడబోతున్నారు.
 
జట్లు (అంచనా)
 
ఆస్ట్రేలియా: డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), మిచెల్‌ మార్ష్‌, స్టీవెన్‌ స్మిత్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, స్టొయినిస్‌, మాథ్యూ వేడ్‌, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, ఆడమ్‌ జంపా, హాజెల్‌వుడ్‌.
 
న్యూజిలాండ్‌: మార్టిన్‌ గప్టిల్‌, డారిల్‌ మిచెల్‌, కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), టిమ్‌ సైఫర్ట్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, జేమ్స్‌ నీషమ్‌, శాంట్నర్‌, టిమ్‌ సౌథీ, ఆడమ్‌ మిల్నే, ట్రెంట్‌ బౌల్ట్‌, ఇష్‌ సోధీ.
 
ఇప్పటివరకు ఇరు జట్లూ మొత్తం 14 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా తొమ్మిది మ్యాచ్‌లలోనూ, న్యూజిలాండ్‌ నాలుగు సార్లు విజయం సాధించగా, ఒక మ్యాచ్ టై అయింది. టీ20 ప్రపంచక్‌పలో ఒకసారి తలపడగా ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు విజయం సాధించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు