ఈ మ్యాచ్‌ల తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టులో ఓపెనర్ డివైన్ 72 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో ఏడు వికెట్ల 161 పరుగులు చేసింది. ఆ తర్వాత 162 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళా క్రికెట్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ స్మృతి మందాన మరోసారి చెలరేగి ఆడినా.. కీలక సమయంలో ఔటవడంతో టీమ్‌కు ఓటమి తప్పలేదు.
మందాన కేవలం 62 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 86 పరుగులు చేసింది. మ్యాచ్ ఆఖర్లో మిథాలీ రాజ్ (20 బంతుల్లో 24), దీప్తి శర్మ (16 బంతుల్లో 21) పోరాడినా టీమ్‌ను గెలిపించలేకపోయారు. చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా.. మిథాలీ, దీప్తి చెరొక ఫోర్ కొట్టి ఆశలు రేపారు.
చివరి బంతికి 4 పరుగులు అవసరమైన దశలో మిథాలీ కేవలం సింగిల్ మాత్రమే తీయగలిగింది. దీంతో రెండు పరుగులతో కివీస్ గెలిచారు. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో కివీస్ జట్టు కైవసం చేసుకుంది. బౌలింగ్‌లోనూ మందాన, రోడ్రిగ్స్‌లాంటి కీలక వికెట్లు తీసిన డివైన్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.