ఇండియా గెలవాలని ప్రార్థిస్తున్న పాక్ జట్టు... ఎందుకు?

శుక్రవారం, 28 జూన్ 2019 (17:04 IST)
ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా జట్టు మాత్రమే 12 పాయింట్‌లతో సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. అయితే న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే 7 మ్యాచ్‌లు ఆడింది. అందులో 5 మ్యాచ్‌లలో నెగ్గింది, 1 మ్యాచ్‌లో ఓడింది, 1 మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది. 
 
మరోపక్క భారత్ 6 మ్యాచ్‌లు ఆడింది, అందులో 5 విజయాలు సాధించగా, 1 మ్యాచ్ రద్దయింది. ఇక నాలుగో స్థానానికి మిగిలిన జట్లు పోటీ పడుతున్నాయి. ఇంగ్లండ్ 7 మ్యాచ్‌ల్లో 4 గెలిచింది, బంగ్లాదేశ్ మరియు పాకిస్థాన్ జట్లు 7 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో గెలిచాయి. అయితే సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ జట్లన్నీ మిగతా మ్యాచ్‌లను తప్పనిసరిగా గెలవాలి. 
 
పాకిస్థాన్ 1992 సంవత్సరం వరల్డ్‌కప్ రిపీట్ అవుతుందని ఆశిస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం భారత్ చేతిలో బంగ్లా ఓడిపోతే, తమకు సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పాక్ భావిస్తోంది. భారత్ ఇంకా ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మరియు శ్రీలంక దేశాలతో మ్యాచ్ ఆడాలి. వీటిల్లో కనీసం ఒకటి గెలిచినా భారత్ సెమీస్‌లో ఆడుగుపెడుతుంది. 
 
మరోవైపు పాకిస్థాన్ జట్టు ఆప్ఘనిస్థాన్ మరియు బంగ్లాదేశ్ జట్లతో మ్యాచ్‌లు ఆడాలి. రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించితే సెమీస్ అవకాశాలు ఉంటాయి. బంగ్లాదేశ్ టీం బాగా రాణిస్తుండడంతో పాకిస్థాన్ కాస్త ఆలోచనలో పడింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిచిందంటే వారికి సెమీస్ అవకాశం మెరుగ్గా ఉంటుందని పాక్ భావిస్తుంది. 
 
కొంతమంది పాక్ క్రికెటర్లు ఇప్పటికే భారత్ బంగ్లాదేశ్ చేతిలో కావాలనే ఓడిపోతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా జరిగిందంటే పాక్ సెమీస్ ఆశలు గల్లంతు అవుతాయని వారు భావిస్తున్నారు. అందుకే భారత్ గెలవాలని పాక్ క్రికెటర్లు ప్రార్థిస్తున్నారట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు