వరల్డ్ కప్ : క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన వెస్టిండీస్ - పాకిస్థాన్

సోమవారం, 16 మార్చి 2015 (11:26 IST)
అద్భుతాలేమీ ఆవిష్కృతం కాలేదు.. అనుకున్నదే జరిగింది.. ప్రపంచకప్ క్వార్టర్స్‌లో చివరి రెండు బెర్తులూ ఊహించిన జట్లే సొంతం చేసుకున్నాయి.. నాకౌట్ రేసులో బాగా వెనుకబడిన వెస్టిండీస్ చివరి లీగ్ మ్యాచ్‌లో యూఏఈపై సునాయాసంగానే నెగ్గింది. అలాగే, ఐర్లాండ్‌పై పాకిస్థాన్ జట్టు విజయభేరీ మోగించి క్వార్టర్ ఫైనల్స్‌లో తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. క్రికెట్ పసికూన ఐర్లాండ్ ఆఖరి వరకూ కసిగానే పోరాడినా విజయం పాకిస్థాన్‌నే వరించింది. అలా మిస్బాసేన తమతో పాటు విండీస్‌నూ నాకౌట్‌కు తీసుకెళ్లింది. 
 
క్వార్టర్స్ ఆశలు సజీవంగా నిలబెట్టుకోవాలంటే తప్పక గెలవాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో యూఏఈపై గ్రాండ్ విక్టరీ సాధించింది వెస్టిండీస్. ఆదివారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు, 117 బంతుల తేడాతో విజయం సాధించింది విండీస్. యూఏఈ నిర్ధేశించిన 176 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్.. జాన్సన్ చార్లెస్ (40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) మెరుపు అర్థ సెంచరీకి జొనాథన్ కార్టర్ (58 బంతుల్లో 50 నాటౌట్) అజేయ అర్థసెంచరీ తోడవడంతో 30.3 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి ఛేదించింది. రామ్‌దిన్ 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. యూఏఈ బౌలర్లలో మంజులా గురుగె, అంజద్ జావెద్ రెండేసి వికెట్లు కూల్చారు. 
 
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ.. పేసర్ జాసన్ హోల్డర్ (4/27) పేస్ ధాటికి జెరోమ్ టేలర్ (3/37) సహకారం కూడా తోడు కావడంతో 47.4 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌటైంది. టాప్-6 బ్యాట్స్‌మెన్‌లో అత్యధిక స్కోరు కేవలం ఏడు పరుగులంటేనే ఆ పేస్ ద్వయం దూకుడెలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 46 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన యూఏఈ వంద పరుగుల మార్కు చేరితే అద్భుతమే అనుకున్న సమయంలో అంజద్ జావెద్ (56), నాసిర్ అజీజ్ (60) అర్థ సెంచరీలతో మెరిసి ఏడో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అలా స్కోరు 150 మార్కు దాటగలిగింది. రస్సెల్ బౌలింగ్ అంజద్ బౌల్డ్ అయిన తర్వాత మళ్లీ వికెట్లు టపాటపా రాలాయి. 22 పరుగుల తేడాతో చివరి నాలుగు వికెట్లు కూలాయి. విండీస్ బౌలర్లలో టేలర్, హోల్డర్‌తో పాటు ఆండ్రి రస్సెల్ 2, మార్లోన్ శామ్యూల్స్ ఒక వికెట్ పడగొట్టారు. హోల్డర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 
 
అలాగే, మరో మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు క్రికెట్ పసికూన ఐర్లాండ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సంచలనం సృష్టిస్తుందనుకున్న పసికూన ఇంటికి పయనం.. విమర్శలతో విసిగెత్తిపోయిన పాక్ క్వార్టర్స్‌లో ప్రవేశించింది. గ్రూప్-బిలో భాగంగా ఆదివారమిక్కడ ఇరు జట్ల మధ్య జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. పాక్ పేసర్లు చెలరేగుతున్నా, విలియమ్ పోర్టర్‌ఫీల్డ్ (131 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 107) సెంచరీతో ఒంటరి పోరాటం చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 237 పరుగులు చేసి ఆలౌటైంది. 
 
ఆ తర్వాత 238 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు.. ఓపెనర్ సర్ఫరాజ్ అహ్మద్ (124 బంతుల్లో 6 ఫోర్లతో 101 నాటౌట్) అజేయ సెంచరీతో మెరవడంతో 46.1 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి ఛేదించింది. సర్ఫరాజ్ కెరీర్లో ఇదే తొలి సెంచరీ. ఇక 2007 ప్రపంచకప్‌లో ఇమ్రాన్ నాజిర్ సెంచరీ అనంతరం, మెగా టోర్నీలో ఓ పాక్ ఆటగాడు శతకం సాధించడం ఇదే తొలిసారి. మరో ఓపెనర్ అహ్మద్ షెహజాద్ (63) కూడా అర్థ సెంచరీతో మెరిశాడు. ఐర్లాండ్ బౌలర్లలో అలెక్స్ క్యుసక్, స్టువర్ట్ థాంప్సన్ చెరో వికెట్ కూల్చారు. సర్ఫరాజ్‌కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక శుక్రవారం జరిగే తమ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో తలపడనుంది పాకిస్థాన్. 

వెబ్దునియా పై చదవండి