వాట్సాప్ సేవలు భారత్‌లో బంద్ కానున్నాయా? ఈ ప్రశ్నకు ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణంగా భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని కఠిన నిబంధనలు అమలు చేయాలని పట్టుబడితే తాము భారత్ నుంచి నిష్క్రమిస్తామని వాట్సాప్ స్పష్టంచేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. మెసేజీల ఎండ్ టు అండే ఎన్‌క్రిప్షన్‌ను ప్రభుత్వం కోరినపుడు, తొలగించాలని బలవంతం చేస్తే దేశాన్ని వీడాల్సి వస్తుందని వాట్సాప్, మెటా సంస్థలు ఢిల్లీ హైకోర్టుకు తెలిపాయి. 2021 నాటి ఐడీ నిబధనలు సవాల్ చేస్తూ వాట్సాప్, మెటా సంస్థలు గతంలో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ రెండు సంస్థల తరపున న్యాయవాదులు తమ తమ వాదనలు వినిపించారు.
2021 ఐటీ మార్గదర్శకాల ప్రకారం, సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వం కోరినప్పుడు మెసేజీల ఎన్‌స్క్రిప్షన్ తొలగించి సమాచార మూలాలు బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం అప్పట్లో ఐటీ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) పేరిట మార్గదర్శకాలను జారీచేసింది. ఈ నిబంధన పాటించడం కుదరదని వాట్సాప్, మెటా తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఏ సమాచారం కోరుతోందో ముందుగా తెలీదు కాబట్టి తాము ప్రభుత్వం కోరినప్పుడు మెసేజీ మూలాలు కనిపెట్టేందుకు వీలుగా కోట్లల్లో మెసేజీలను ఏళ్ల తరబడి సోర్ట్ చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే, ఈ విషయమై వాదులు, ప్రతివాదుల మధ్య మరింత చర్చ జరగాలని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి చట్టం మరే దేశంలోనైనా ఉందా అన్న కోర్టు ప్రశ్నకు బ్రెజిల్ లాంటి దేశాల్లో కూడా ఈ రూల్స్ లేవని మెటా తరపు లాయర్లు పేర్కొన్నారు.
అయితే, ప్రైవసీ అనేది అనుల్లంఘనీయం కాదన్న కోర్టు.. అవసరాలకు హక్కులకు మధ్య సమౌతౌల్యం ఉండాలని పేర్కొంది. కేంద్రం తరపు న్యాయవాదులు ఈ మార్గదర్శకాలు అసరమని పేర్కొన్నారు. అభ్యంతర కంటెంట్, ఉగ్రవాదం, సమాజంలో హింసకు కారణమయ్యే కంటెంట్ మూలాలు తెలియాల్సిందేనని స్పష్టంచేశారు. 2021 ఐటీ మార్గదర్శకాలకు సవాలు చేస్తూ వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఉన్న పిటిషన్లు తొలుత సుప్రీం కోర్టుకు చేరాయి. అయితే, సర్వోన్నత న్యాయస్థానం వీటిని ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ మార్చి 22న ఆదేశాలు జారీ చేసింది.