భారత టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్

ఆదివారం, 26 జూన్ 2022 (10:17 IST)
భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. అయితే, తొలి టెస్టు ప్రారంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత క్రికెటర్లకు నిర్వహించిన యాంటిజెన్ పరీక్షల్లో కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన్ను క్వారంటైన్‌కు తరలించారు. వార్మప్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడారు. దీంతో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లలో కరోనా కలకలం రేగింది. 
 
ఇరు జట్ల ఆటగాళ్లకు శనివారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో రోహిత్ శర్మ ఫలితం పాజిటివ్‌గా వచ్చినట్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామున ఓ ట్వీట్ చేసింది. 
 
కరోనా నిర్ధారణ కాగానే జట్టు బస చేసిన హోటల్‌లోనే అతడు క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు తెలిపింది. కాగా, ప్రస్తుతం లీసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న నాలుగు రోజుల వామప్ మ్యాచ్‌లో రోహిత్ ఆడుతుండడంతో ఇరు జట్లలోనూ ఆందోళన మొదలైంది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ 25 పరుగులు చేశాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు