ఐపీఎల్ 2025 సీజన్ పోటీల్లో భాగంగా, బుధవారం హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ మరోమారు ఓడిపోయింది. ఇది ఆ జట్టుకు ఆరో ఓటమి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. సన్ రైజర్స్ నిర్ణయించిన 144 పరుగుల విజయలక్ష్యాన్ని 15.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇందులో రోహిత్ శర్మ (70), సూర్య కుమార్ యాదవ్ (40) చొప్పున పరుగులు చేశాడు.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ముంబై బౌలర్ల బాధ్యతాయుత బౌలింగ్ రైజర్స్ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఆపసోపాలు పడ్డారు. ఫలితంగా ముంబై ఇండియన్స్ ముందు ఓ మోస్తారు లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగారు. సన్ రైజర్స్‌కు టోర్నీలో ఇది ఆరో పరాజయం. దీంతో ఆ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.